రివ్యూ: సమ్మతమే మూవీ

రివ్యూ: సమ్మతమే మూవీ

రాజా వారు రాణి గారు, ఎస్.ఆర్‌‌.కళ్యాణ మండపం చిత్రాలతో ఆకట్టుకున్న కిరణ్‌ అబ్బవరం, ‘సమ్మతమే’ అనే ప్రేమకథా చిత్రంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌ నటించింది.. ఈ ముగ్గురూ షార్ట్‌ ఫిల్మ్స్‌ నుంచి వచ్చినవాళ్లే కావడం విశేషం. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌ ఎలా ఉందో ఓసారి రివ్యూలో పరిశీలిద్దాం..

కథ ఏమిటంటే... 

చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో ఆడవాళ్లు లేని లోటును తీర్చగలిగే జీవిత భాగస్వామి ఎప్పుడెప్పుడు తన జీవితంలోకి వస్తుందా అని ఎదురుచూస్తుంటాడు కృష్ణ (కిరణ్ అబ్బవరం). జీవితమంటే కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్న కృష్ణకు పెళ్లికి ముందు ప్రేమలో పడటం అంటే నచ్చదు. రాబోయే లైఫ్‌ పార్టనర్‌‌ కూడా తనలాగే ఉండాలనుకుంటాడు. ఆ కారణంతోనే శాన్వి (చాందిని చౌదరి)పై ఇష్టం ఉన్నా పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత మరో ఇరవై పెళ్లిచూపులకు వెళ్లినా తనకు నచ్చే క్వాలిటీస్‌ ఉన్న అమ్మాయి దొరకదు. ఈలోపు శాన్విపై తనకున్నది ఇష్టం కాదు, ప్రేమ అని అర్థమవుతుంది. తిరిగి ఆమెకి దగ్గరవుతాడు. కానీ సిటీ కల్చర్‌‌లో పెరిగిన శాన్వి పద్ధతులు, ఇష్టాలు అతనికి నచ్చవు. రాధ కావాలనుకుంటే సత్యభామ వస్తోందని ఫీలయిపోతుంటాడు. ఆమెని మోడ్రన్ కల్చర్ కు దూరంగా, తన ఇష్టాలకి దగ్గరగా మార్చుకోవాలనుకుంటాడు. అతని ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది, చివరికి ఆ ఇద్దరిలో ఎవరి ఇష్టాలకి ఎవరు సమ్మతమే అన్నారు అనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే... 

‘ప్రేమ అంటే ఒకరి ఇష్టాయిష్టాల్ని మరొకరు గౌరవించడమే తప్ప మన ఇష్టాల కోసం మరొకరి ఇష్టాలను చంపేయడం కాదు’ అనే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది. ఈ పాయింట్‌కి లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ జోడించారు. ఫస్ట్ హాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల పరిచయం, వారిమధ్య ప్రేమ మొదలవడం లాంటి సీన్స్ తో సరదాగా గడిచిపోయింది. తన ఇష్టాలకు తగ్గట్టుగా ప్రేమించిన అమ్మాయిని మార్చుకునే ప్రయత్నాలే సెకెండాఫ్. నిజానికి ఇక్కడి నుంచి కథలో వేగం పెరగాలి. కానీ నెమ్మదించింది. ‘పాతికేళ్లు పెరిగిన అమ్మాయి ఇష్టాయిష్టాల్ని తన జీవితంలోకి రాగానే భర్త మార్చాలనుకోవడం కరెక్ట్ కాదు’ అనే పాయింట్‌ను సింగిల్‌ డైలాగ్‌లో చెప్పిన దర్శకుడు, అందుకు తగ్గ సీన్స్‌ రాసుకోవడంలో కొంత తడబడ్డాడు. చెప్పదలచుకున్న పాయింట్‌లో ఏదో మిస్‌ అయిన ఫీలింగ్. బలమైన సీన్స్ రాసుకుంటే ఫలితం మరోలా ఉండేది. కానీ అలా జరగలేదు. కాకపోతే రెండు గంటల పది నిముషాలే నిడివి కావడం, ఎక్కడా బోర్‌‌ కొట్టించకుండా సాఫీగా నడిపించడం, చక్కని నేపథ్య సంగీతం కాస్త కలిసొచ్చాయి. కొత్తదనం ఆశించకుండా సరదాగా టైమ్‌ పాస్‌కి ఓసారి థియేటర్‌‌లో చూడొచ్చు.

నటీనటులు ఎలా చేశారంటే..

ఇలాంటి మిడిల్‌ క్లాస్ క్యారెక్టర్స్ కిరణ్‌కి కొత్తేమీ కావు. ఇప్పటి వరకు అతను చేసినవన్నీ అలాంటివే. అందుకే కృష్ణ పాత్రను చాలా ఈజీగా చేసుకుపోయాడు. తన ఆలోచనలకు, వాస్తవాలకు మధ్య సంఘర్షణ పడే యువకుడిగా తన నటన ఆకట్టుకుంది. తన ప్రస్టేషన్‌ నుంచి వచ్చే కామెడీ కూడా బాగా వర్కవుటయింది. మోడర్న్ అమ్మాయి క్యారెక్టర్‌‌కి చాందిని న్యాయం చేసింది. ఆ పాత్రకి తను యాప్ట్ అనిపించింది. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ కుటుంబ సభ్యులుగా శివన్నారాయణ, అన్నపూర్ణమ్మ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఇలాంటి ప్రేమకథలకు కథనంతో పాటు చక్కని సంగీతం తోడయితేనే మెప్పించగలుగుతాయి. మ్యూజిక్ విషయంలో సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు శేఖర్‌‌ చంద్ర. సిచ్యుయేషన్‌కి తగ్గట్టుగా సాగే ఏడు  మెలోడియస్‌ ట్యూన్స్ తో పాటు నేపథ్య సంగీతంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే మరీ కొత్తది కాకపోయినా మంచి పాయింటే తీసుకున్నాడు. కాకపోతే దాన్ని జస్టిఫై చేసే సీన్స్ ను కావలసినంత బలంగా వేయలేకపోయాడు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తపడి ఉంటే ఈ సినిమా కొన్ని వర్గాల వారికి మాత్రమే కాక అందరికీ సమ్మతమై ఉండేది.

రివ్యూ: సమ్మతమే
నటీనటులు:  కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి, తదితరులు
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మాసం
నిర్మాత: కంకణాల ప్రవీణ
దర్శకత్వం: గోపినాథ్ రెడ్డి
రిలీజ్ డేట్: జూన్ 24,2022