OTT Drama: అప్పులున్న ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా.. ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Drama: అప్పులున్న ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా.. ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘అప్పులు.. ఆవేదన.. ఆశల పోరాటం..’ ఇదే కదా మధ్యతరగతి సామాన్యుడి జీవితం. ఒకవైపు ఎదగాలనే కలలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. ఈ రెండింటి మధ్య నిత్యం పోరాడుతూనే ఉంటుంది సామాన్యుడి జీవితం. కుటుంబ బాధ్యతలు, సమాజంలో పరువు, పిల్లల భవిష్యత్ కోసం అప్పులు చేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చే ఎన్నో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇదే. ఇపుడు ఈ వాస్తవ సంఘటనలను ప్రతిబింబించే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘కార్మేని సెల్వం’ (Carmeni Selvam). ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసుకుందాం. 

‘కార్మేని సెల్వం’ OTT:

వర్సటైల్ యాక్టర్స్ సముద్రఖని-గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లక్ష్మి ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా మాత్రం యావరేజ్ ఫలితాన్నే సాధించింది.

అయితే సినిమా చూసిన ప్రేక్షకులను కథ, ఎమోషన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్, మూవీ ఓటీటీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కార్మేని సెల్వం’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. జూన్ 3 నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. 

ఈ చిత్రం నిజాయితీగా జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ (సముద్రఖని) సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని ఎమోషనల్‌‌గా చూపించాడు డైరెక్టర్ రామ్ చక్రి. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుందనే మెసేజ్ అందించారు. మధ్యతరగతి జీవితాల్లో డబ్బు ఆడించే ఆట ఎలా ఉంటుంది.. నిజాయతీగా బతికే వ్యక్తి మాయా ప్రపంచపు మత్తులో పడి ఎలా అప్పులపాలయ్యాడు? అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. 

కథేంటంటే: 

సెల్వం (సముద్రఖని) ఓ కారు డ్రైవర్‌. భార్య శాంతి (లక్ష్మీ ప్రియ)తో కలిసి కష్టపడి పనిచేస్తూ సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటాడు. అయితే కుటుంబ వేడుకలో జరిగిన అవమానం కారణంగా పొదుపు చేసిన డబ్బు, బంగారం మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కుమారుడు ప్రమాదానికి గురవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక అప్పు తీర్చేందుకు యజమాని సంపత్‌కు (గౌతమ్ వాసుదేవ్ మీనన్) తెలియకుండా అతని కారును అద్దెకు తిప్పడం ప్రారంభించిన సెల్వం, క్రమంగా మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అప్పులు, కుటుంబ బాధ్యతలు, యజమానికి నిజం తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నాల మధ్య సెల్వం జీవితం ఎలా మారింది? చివరకు అతను సమస్యల నుంచి బయటపడ్డాడా లేదా? అనేదే సినిమా మెయిన్ పాయింట్.

విశ్లేషణ:

‘కార్మేని సెల్వం’ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను అత్యంత సహజంగా చూపించిన చిత్రం. భారీ ట్విస్టులు, కమర్షియల్ హంగులు కాకుండా జీవితానికి దగ్గరగా ఉండే కథతో దర్శకుడు రామ్ చక్రి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

సెల్వం పాత్రలో సముద్రఖని తన సహజ నటనతో ఆకట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలు, అప్పుల ఒత్తిడి, నిజాయితీ మధ్య నలిగిపోయే ఓ సామాన్యుడి భావోద్వేగాలను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. శాంతి పాత్రలో లక్ష్మి ప్రియ నటన కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్ర తక్కువ నిడివి ఉన్నప్పటికీ కథలో కీలక ప్రభావాన్ని చూపిస్తుంది.

►ALSO READ | నటి ఖుష్బూ ఇంటిలో పెళ్లి సందడి.. పీఎం మోదీని ఆహ్వానించిన సుందర్ ఫ్యామిలీ!

సినిమాలో ప్రధానంగా అప్పులు, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ గౌరవం కోసం తీసుకునే నిర్ణయాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని దర్శకుడు హృదయానికి హత్తుకునేలా చూపించారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితి గతులను ఎలాంటి అతిశయోక్తులు లేకుండా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయింది.

ఫైనల్గా ‘కార్మేని సెల్వం’ డబ్బు, అప్పులు, కుటుంబ బాధ్యతల మధ్య పోరాడే సామాన్య మనిషి జీవితాన్ని హృద్యంగా ఆవిష్కరించిన ఓ మంచి ఫ్యామిలీ డ్రామా. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో తప్పక చూడదగ్గ చిత్రమిది.