సనాతన ధర్మం అజరామరం

సనాతన ధర్మం అజరామరం

ఈ నెల మొదట్లో.. చెన్నై‌‌లో ‘సనాతన ధర్మ నిర్మూలన’ పేరుతో జరిగిన ఓ సదస్సులో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాలతో పోలుస్తూ, భారతీయ సమాజం నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇతర మతవిశ్వాసాలపై ఇలాంటి వేదికల ద్వారా మాట్లాడితే.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద వివాదాన్ని సృష్టించి.. భారతదేశంలో మెజారిటీ ప్రజల దౌర్జన్యం పెరిగిందని, మైనారిటీలను శారీరకంగా, మానసికంగా హింసించే కార్యక్రమాలు చేస్తున్నారంటూ హంగామా జరిగుండేది. కానీ.. ఇది పరమత సహనం కలిగిన, అందరినీ గౌరవించే, పిడివాదానికి దూరంగా ఉండే సనాతన ధర్మంపై ఎంత విషం చిమ్మినా ఎవరికీ పట్టదు.

దీంతోపాటుగా ఈ సమావేశంలో సదరు మంత్రి మాట్లాడుతూ.. ‘సనాతనాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయడ’మనే ఇతివృత్తాన్ని ఎంచుకోవడం పట్ల.. కార్యక్రమ నిర్వాహకులకు కితాబిచ్చారు. అవి వెకిలి చేష్టలు, విషపు కూతలు. అవి భారతీయ ధార్మిక విశ్వాసాలైన హిందు, సిక్కు, బౌద్ధ, జైన మతాలను కూడా తీవ్రంగా అవమానించడమే. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు చేసిన వ్యాఖ్యలపై.. దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దేశంలో  100 కోట్ల మంది తాము ఆచరించే సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అందరూ ఏకతాటిపైకి వచ్చి తీవ్రంగా ఆక్షేపించిన సందర్భంలో.. ఉదయనిధి స్టాలిన్ జాతికి క్షమాపణలు చెబుతారని దేశమంతా ఆశించింది. కానీ దీనికి భిన్నంగా.. 

Also Rard: బీజేపీ బస్సు యాత్రలు వాయిదా

సనాతన ధర్మం విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించడం ఆయనకు ధర్మం పట్ల ఉన్న  ద్వేషానికి, అహంకారానికి నిదర్శనం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోని 28 పార్టీల్లో ఒక్కరు కూడా ఖండించకపోవడం దురదృష్టకరం. కొన్ని పార్టీలు ఓ అడుగు ముందుకేసి.. మరింత అవమానకర  రీతిలో మాట్లాడుతూ.. కొందరు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఇంతటితో ఆగలేదు. ఆ కూటమిలోని సీనియర్ నాయకుడొకరు.. సనాతన ధర్మాన్ని కుష్టు వ్యాధితో.. మరో నాయకుడు ఎయిడ్స్‌‌తో పోల్చారు. 

 తనకు తాను మార్చుకుంటూ.. నిత్యనూతనం

కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలను దాటుకుని, అన్ని అవరోధాలను ఎదుర్కొంటూ యావత్ ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ‘వసుదైవ కుటుంబకం’ భావనను విశ్వవ్యాప్తం చేయడమే సనాతన ధర్మం ఉద్దేశం. తోటి మానవులను ప్రేమించడం, వారికి అన్ని వేళల్లో సహకరించడం, ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలవడం.. ‘మానవసేవే  మాధవ సేవ’ అనే ఆలోచనను ఆచరణలో చూపించడమే సనాతన ధర్మం విశిష్టత. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభల్లో.. స్వామి వివేకానంద, సనాతన ధర్మాన్ని చాలా చక్కగా విశ్లేషించారు. భారతదేశం గత 9 ఏళ్లుగా, సనాతన ధర్మం గురించి వివేకానందుడు చెప్పిన అంశాలను కార్యాచరణలో పెడుతూ వస్తోంది.  సనాతన ధర్మం.. ఏ విషయాన్నీ మొండిగా వాదించకుండా.. ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, తనను తాను మార్చుకుంటూ, సంస్కరించుకుంటూ నిత్య నూతనంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇవాళ ప్రధానమంత్రి వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, వారి మంత్రివర్గంలోనూ 27 మంది ఓబీసీలకు, 12 మంది ఎస్సీలు, ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉంది. అలాంటప్పుడు ఈ సనాతన ధర్మంపై కొందరు కక్కుతున్న విషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

స్టాలిన్లు వస్తుంటారు, పోతుంటారు,  ధర్మమే శాశ్వతం

సనాతన ధర్మాన్ని.. మనసా, వాచా, కర్మణా పాటించే వారు మాత్రమే.. ఆ ధర్మం స్ఫూర్తితో లోతైన తాత్విక భావనతో దేశాన్ని ముందుకు నడపగలరు. దేశ శ్రేయస్సును కాంక్షించగలరు. ప్రధానమంత్రి మోదీ ఆలోచనల కారణంగానే.. ఇవాళ ‘వసుధైవ కుటుంబకం’ ప్రపంచ నినాదంగా మారింది. ఈ విషయాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. భారతీయ సనాతనధర్మమే.. ప్రపంచమంతా విస్తరిస్తోంది. ప్రపంచమంతా దీన్ని ఉత్సాహంగా స్వాగతిస్తే.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నేతలకు మాత్రం మింగుడు పడటం లేదు.  సనాతన ధర్మం కాలపరీక్షకు తట్టుకుని నిలబడింది. ఎన్నో విదేశీ దురాక్రమణలు, ఊచకోతలు, కుట్రలను, విధ్వంసాలను తట్టుకుంది.  సనాతన ధర్మం ప్రతి భారతీయుడి జీవన విధానంలో కనిపిస్తుంది. భూమండలం ఉన్నన్ని రోజులు సనాతన ధర్మం ఉంటుంది. నిత్య నూతనమై.. తనను విశ్వసించేవారికి దారి చూపుతుంది. అందుకే సనాతన ధర్మాన్ని, దాన్ని విశ్వసించే వారిని అంతమొందిస్తామని ప్రగల్భాలు పలికేవారు వస్తుంటారు, పోతుంటారు. కానీ ధర్మం శాశ్వతం. దీనికి అంతం లేదనేది జగమెరిగిన సత్యం. సనాతనం అజరామరం.

మోదీపై ధ్వేషంతో..

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి నాయకులు, తమకు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఉన్న కోపాన్ని, మెల్లిగా దేశం పట్ల ద్వేషంగా మార్చుకుంటున్నారు. ప్రతి అంశంలోనూ దేశాన్ని తక్కువచేసి మాట్లాడటం, ప్రతి అంశాన్నీ దేశం పట్ల  ప్రతికూలంగా చూపించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన, ఓ పేద వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలకు చేరుకోవడం, దేశం నలుమూలలా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకోవడాన్ని ఆ కూటమి నేతలు ఇప్పటికీ  జీర్ణించుకోలేకపోతున్నారు. వారిలో ఉన్నటువంటి ఈ ఆక్రోశం, ఏమీ చేయలేకపోతున్నామనే ఆవేదనే.. సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడేలా చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సనాతన ధర్మం బోధించిన అంశాలను చిత్తశుద్ధితో అమలుచేస్తూ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్నారు.

ప్రపంచ శక్తిగా మారడం ఓర్వలేకనా?

ప్రధాని మోదీ భారతదేశాన్ని విశ్వగురుగా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశం గత 9 ఏళ్లుగా.. ప్రపంచ శక్తిగా మారే క్రమంలో సాధిస్తున్న ప్రగతిని చూసి ఓర్వలేని ఈ పార్టీల కుట్రపూరితమైన ఆలోచనలను మనమంతా అర్థం చేసుకోవాలి. విదేశాల్లో భారతదేశాన్ని బలహీన దేశంగా, వెనుకబడిన దేశంగా చూపించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలి. జీ20 సమావేశాలకు నేతృత్వం వహిస్తున్న తరుణంలో.. భారతదేశానికి వస్తున్న పేరును చూసి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఫ్రికన్ యూనియన్‌‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇచ్చే విషయంలో అన్ని దేశాలను ఏకగ్రీవంగా ఒప్పించడం ద్వారా ‘గ్లోబల్ సౌత్’ గొంతుకను బలంగా వినిపించిన భారత ఖ్యాతిని ఈ నాయకులు అంగీకరించలేకపోతున్నారు.  భారత ఖ్యాతిని అంగీకరించని నాయకులను ప్రజలు కూడా అంగీరించకూడదు.

– జి. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు