ఈ యేడూ పనులు డౌటే.. ముందుకు సాగని సాగర్‌‌ లెఫ్ట్‌ కెనాల్‌ రిపేర్లు

ఈ యేడూ పనులు డౌటే.. ముందుకు సాగని  సాగర్‌‌ లెఫ్ట్‌ కెనాల్‌ రిపేర్లు
  • రూ.14 కోట్లు మంజూరైనా టెండర్లు కంప్లీట్ కాలే
  •  గండ్లు పడ్డ వద్ద తాత్కాలిక పనులతో సరి
  • వరదొచ్చేలోగా పూర్తిచేస్తామంటున్న ఎన్‌ఎస్‌పీ ఆఫీసర్లు

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమకాల్వ రిపేర్‌‌ పనులు ఈ యేడూ కూడా మొదలయ్యేలా లేవు.  కెనాల్‌ దెబ్బతిన్న ప్రాంతాల్లో రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా టెండర్‌‌ దశ దాటడం లేదు. లాస్ట్‌ ఇయర్‌‌ టెండర్‌‌ పిలిచినా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ సారి మళ్లీ టెండర్‌‌ నిర్వహించారు. ప్రస్తుతం అండర్‌‌ ప్రాసెస్‌లో ఉందని ఎన్‌ఎస్పీ అధికారులు చెబుతున్నారు.  నిరుడు గండ్లు పడి కాల్వ దెబ్బతిన్న చోట్ల  చేపట్టిన వర్క్స్‌ కూడా నెమ్మదిగా సాగుతున్నాయి.  ప్రాజెక్టుకు వరదొచ్చేలోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు మట్టి పనులు కూడా పూర్తి కాలేదు.  ఆగస్టులో రిజర్వాయర్‌‌కు వరదొచ్చే అవకాశం ఉందని, ఆ లోగా సీసీ లైనింగ్ పనులు కంప్లీట్ కావడం డౌటేనని రైతులు అంటున్నారు. 

రూ. 14 కోట్లు మంజూరు 

ప్రభుత్వం ఎనిమిదేళ్ల కింద రూ. 4,444 కోట్ల వరల్డ్ బ్యాంకు నిధులతో నాగార్జునసాగర్  ప్రాజెక్టుతో పాటు ఎడమ కాల్వను ఆధునీకరించే పనులు చేపట్టింది.  కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత కొన్నిచోట్ల కాల్వ కట్టకు పగుళ్లు వచ్చి లైనింగ్ దెబ్బతిన్నది.  0–70 కిలో మీటర్ల వరకు 5 వేల మీటర్ల మేర కాల్వ దెబ్బతిన్నట్లు ఎన్‌ఎస్పీ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం నిరుడు మట్టి పనులు, సీసీ లైనింగ్ కోసం రూ.14 కోట్లు మంజూరు చేసింది. అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టినా.. ఎవరూ ముందుకు రాలేరు. దీంతో ఈయేడు మరోసారి టెండర్ పిలువగా ఫైనల్‌ అయ్యేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.  కానీ, అధికారులు మాత్రం ఈ యేడు పనులు చేపతామని చెబుతున్నారు. వాస్తవానికి రబీ సీజన్‌లో వరిసాగు పూర్తి కాగానే నీటి విడుదలను నిలిపివేసిన పనులను చేపట్టాల్సి ఉంది. అలా కాకుండా నీటి విడుదల సమయంలో హడావుడి చేస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. 

తాత్కాలిక పనులతో సరి

ఎడమకాల్వ లైనింగ్ పటిష్టంగా లేకపోవడంతో నిరుడు సెప్టెంబర్​7న నిడమనూరు మండలం వేంపాడు పరిధిలో 32.109 కిలో మీటర్ వద్ద యూటీకి గండి పడింది.  దీంతో నిడమనూరు, నరసింహుల గూడెం గ్రామాల్లో10 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది.  నీటి ఉధృతికి హాలియా–మిర్యాలగూడ ప్రధాన రహదారి దెబ్బతినడంతో పాటు స్థానిక రైస్ మిల్లు, ఇటుకల బట్టి యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ గండి పూడ్చేందుకు 14 రోజులపాటు నీటిని నిలిపివేయాల్సి వచ్చింది.  ఫలితంగా చివరి ఆయకట్టు పంటలు ఎండిపోయాయి.  అలాగే గత డిసెంబర్‌‌లో 16 కిలోమీటర్ల వద్ద ఎడమకాల్వ లైనింగ్ కుంగిపోయి మట్టి కాల్వలోకి జారింది.  దీంతో అధికారులు ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా మరమ్మతు చేపట్టారు. అలాగే హాలియా సమీపంలోని 14 కిలో మీటర్​వద్ద కాల్వ కుంగిపోగా.. టెండర్ పిలిచి రూ.14 లక్షలతో లైనింగ్ పనులు చేపట్టారు.  కానీ, పాత మట్టిని తొలగించి కొత్త మట్టిని నింపే పనులే ఇంకా జరుగుతున్నాయి. 

నీటి విడుదలప్పుడు పనులేంటి?

ఎండాకాలంలో కాల్వ లైనింగ్ పనులను చేపట్టాల్సిన అధికారులు.. నీటి విడులప్పుడే పనులు చేయడం సరికాదు. హడావుడిగా పనులు చేసి వదిలేస్తుండడంతో గండ్లు పడుతున్నయి.  ప్రతి యేడు ఇదే పరిస్థితి ఉంటుంది.  సీసీ లైనింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయకుంటే ఈ యేడూ కష్టాలు తప్పేలా లేవు. 

- ఉడ్తూరి నర్సిరెడ్డి కొత్తపల్లి గ్రామ రైతు

త్వరగా పూర్తి చేస్తం

ఎడమ కాల్వ పరిధిలో పెండింగ్ లో ఉన్న లైనింగ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుటున్నం. 0 –70 కి.మీ. వరకు 5 వేల మీటర్ల మేర చేపట్టనున్న రిపేర్ పనులకు టెండర్‌‌ ప్రాసెస్‌ నడుస్తోంది. పూర్తికాగానే పనులు మొదలు పెడ్తం. హాలియా పరిధిలో14 కిలోమీటర్  వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను యుద్ధ ప్రాతికన చేపడుతున్నం.  రైతులకు నీటి విడుదల చేసే గడువు వరకు పనులు పూర్తయ్యేలా చూస్తం. 

- సంపత్, ఎన్‌ఎస్పీ డీఈ