
- ఈయూ ఆంక్షలే కారణం
న్యూఢిల్లీ: రష్యా కంపెనీ రాస్నెఫ్ట్‌కు వాటాలున్న నయారా ఎనర్జీ, వరుసగా రెండో నెలలో కూడా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి క్రూడాయిల్‌ను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. వెస్ట్రన్ షిప్పింగ్ కంపెనీలు చమురు రవాణాకు నిరాకరించడంతో, గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీలో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించింది. ఆగస్టులో ఈ కంపెనీ రోజుకు 2.42 లక్షల బారెల్స్ రష్యా చమురు పొందగా, సెప్టెంబర్‌లో రోజుకి 3.32 లక్షల బారెల్స్ రష్యా చమురు కొనుగోలు చేసింది.
ఇరాక్, సౌదీ అరేబియా నుంచి మాత్రం ఆయిల్ అందలేదు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఈ ఏడాది జులైలో నయారా రిఫైనరీపై ఆంక్షలు విధించడంతో, షిప్పింగ్, బీమా, చెల్లింపుల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. గ్లోబల్ ట్రేడ్ ఎనాలసిస్ కంపెనీ క్లెప్లర్ ప్రకారం, “నయారా పరిస్థితి కష్టంగా ఉన్నా, సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రష్యా చమురు ఇప్పటికీ భారత్‌కు ప్రధాన సరఫరాదారుగా ఉంది.
సెప్టెంబర్‌లో ఈ దేశం నుంచి చమురు కొనుగోలు తగ్గినప్పటికీ, ఇది జులైలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రభావమే. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి సరఫరా బలంగా ఉండడాన్ని చూస్తే భారత్ డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది” అని అన్నారు. రష్యా చమురు ధరలు ఇతర దేశాల కంటే బ్యారెల్‌పై 3–5 డాలర్లు తక్కువగా ఉండటంతో, అధికారిక ఆదేశాలు లేకుండా భారత రిఫైనరీలు ఈ డిస్కౌంట్‌ను వదిలే అవకాశం లేదు. “ఇప్పటికైతే పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ ఇండియా డైవర్సిఫికేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి” అని రిటోలియా అన్నారు.