
వరద అంతగా లేదు కదా అనుకుని ఇసుక కోసం వెళ్లారు. కూలీలతో కలిసి పనులు మొదలు పెట్టారు. కానీ ఉన్నట్లుండి ప్రళయ గోదావరి లాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వరలు మొదలయ్యాయి. వరద ఉధృతి పెరుగుతోంది.. ట్రాక్టర్లను బయటకు తీద్దాం అనుకునేలోపే భారీ వరద చుట్టుముట్టింది. ట్రాక్టర్లు పోయినా సరే.. ప్రాణాలు కాపాడుకుందాం అనుకుని బయటకు పరుగెత్తారు డ్రైవర్లు, కూలీలు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు వాగులో పరిస్థితి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మానేరు వాగుకు ఇంతకింతకూ పెరుగుతూ భయంకరంగా ప్రవహిస్తోంది. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉదయం ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు మానేరు వరదలో చిక్కుకున్నాయి. ఎనిమిది ట్రాక్టర్లు వరదల్లో చిక్కుకోవడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి- ఒడేడ్ గ్రామాల మధ్య గల మానేరు వాగులోకి ఇసుకకోసం వెళ్లిన 8 ట్రాక్టర్లు వరదలో చిక్కుకున్నాయి. మొదట అంతగా వరద లేకపోవడంతో ఇసుకను తవ్వుతూ ఉన్నారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి డ్రైవర్లు, కూలీలు వెంటనే బయటకు పరుగెత్తారు.
ప్రవాహం పెరుగుతుండటంతో పరిస్థితి భయంకరంగా తయారైంది. వరద ఉధృతికి ట్రాక్టర్లు ఒరిగి పోయిన దృశ్యాలు ఆంతోళన కలిగిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. వెంటనే అక్కడికి చేరుకుని సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు స్థానిక పోలీసులు.