ఒడిశా రాజ్‌భవన్‌లో గంధం చెట్లు చోరీ

ఒడిశా రాజ్‌భవన్‌లో గంధం చెట్లు చోరీ

గంధపు చెట్టుకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఆ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే చాలు.. దొంగలకు పండగే. అలాంటి గంధం చెట్టును ఒడిశాలో దొంగలు ఎత్తుకెళ్లారు. ఇది మామూలు విషయంలానే కనిపిస్తున్నా.. అసలు ఆ దొంగతనం ఎక్కడ జరిగిందో తెలిస్తే షాక్ అవ్వడం తప్పేం కాదేమో. ఇంతకీ అది ఎక్కడ జరిగిందనే విషయానికొస్తే.. ఒడిశాలోని రాజ్ భవన్ ఆవరణలో. గవర్నర్ బస చేసే రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర గవర్నర్ ఉండే ప్రాంతమంటే ఎంత సెక్యూరిటీ ఉండాలి.. అలాంటిది ఏకంగా చెట్లను దొంగిలించారంటే.. ఏంటీ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక సామాన్యులు చందనం పెంచితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గవర్నర్ సిబ్బంది, భద్రతపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఏకంగా గవర్నర్ అధికారిక నివాసంలోనే ఈ ఘటన జరగడంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాజ్ భవన్ ఆవరణలో చందనం చెట్లు నరికి, దొంగిలించిన వారిలో నిందితులుగా కొందరు కింది స్థాయి సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, కానీ ఇప్పటివరకూ అసలు దొంగలు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదని స్పష్టం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.