
సదాశివపేట, వెలుగు : గవర్నమెంట్హాస్పిటల్లో పేషెంట్లకు బెటర్ ట్రీట్మెంట్ అందించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ డాక్టర్లకు సూచించారు. శనివారం సదాశివపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. పేషెంట్లను నిలబెట్టి చికిత్స చేయడం, వివిధ కారణాలతో డెంటల్, తదితర వైద్య పరికరాలు వినియోగించకుండా పక్కన పెట్టడం, ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరికరాలను వినియోగంలోకి తేవాలని, డస్ట్ బిన్ లను ఏర్పాటు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్సత్యనారాయణను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో త్వరగా సిద్ధం చేయాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బీ ఈఈ, స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో ఉన్నారు.
డబుల్ ఇండ్లను పంపిణీకి రెడీ చేయాలి:సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట రూరల్, వెలుగు : మండల పరిధిలోని చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి పంపిణీకి రెడీ చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. శనివారం కలెక్టర్ ఆఫీస్‌లో ఆ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ ఇతర సౌకర్యాలు కల్పించి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛ గురుకుల్ పోస్టర్ ను ఆయన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మెదక్‌లో చేసిందేమీ లేదు : అభివృద్ధిపై చర్చకు మంత్రి, ఎమ్మెల్యే సిద్ధమా?
బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సవాల్
మెదక్ టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీలేదని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కొబ్బరికాయలు కొట్టి తాము మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో మెదక్‌లోని రాందాస్‌చౌరస్తాలో చర్చకు తాము సిద్ధమని, మంత్రి, ఎమ్మెల్యే సిద్ధమా? అని సవాల్ విసిరారు. శనివారం మెదక్ పట్టణంలోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మెదక్ రైల్వేలైన్‌కు రూ.కోటి నిధులు మంజూరు చేసిందని, వాటిని తమ ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పి కొబ్బరికాయలు కొట్టి పండుగలు చేసుకుంటున్నారని అధికార పార్టీ తీరుపై మండిపడ్డారు. మెదక్ పట్టణంలోని స్టేడియంలో సింథటిక్ ట్రాక్‌కు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.7 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మెదక్ పట్టణ అభివృద్ధి ఎనిమిదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. మెదక్‌ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మెదక్ జడ్పీ మాజీ చైర్మన్బాలయ్య, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ నల్లాల విజయ్ కుమార్, యువమోర్చా జిల్లా ప్రెసిడెంట్ ఉదయ్ కిరణ్, యువ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ రాజు పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణ కోసమే వీక్లీ పరేడ్
సిద్దిపేట రూరల్, వెలుగు : పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసమే వీక్లీ పరేడ్ ను నిర్వహిస్తున్నట్లు సీపీ ఎన్. శ్వేత తెలిపారు. శనివారం పెద్ద కోడూర్ గ్రామ శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ లో ఆమె గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్, స్క్వాడ్, లాఠీ డ్రిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీక్లీ పరేడ్ సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు జరిగేటప్పుడు పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి శిక్షణ అందించాలని ఏఆర్ అడిషనల్ డీసీపీకి సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ధరణి కుమార్, రామకృష్ణ, ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, టాస్క్ ఫోర్స్ సీఐలు గురు స్వామి, దిలీప్ కుమార్, మహిళా ఎస్సై స్రవంతి, మహిళా ఆర్ఎస్సై పుష్ప పాల్గొన్నారు.
16 నుంచి పోలీస్ ఫిజికల్ ట్రైనింగ్
ఈనెల 16 నుంచి పోలీస్ ఫిజికల్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ ఎన్. శ్వేత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక పట్టణాలలో మంత్రి హరీశ్ రావు సహకారంతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు రిటన్ టెస్ట్ ఎంత ముఖ్యమో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని సూచించారు.
సర్పంచులు చనిపోతున్నా సర్కార్ పట్టించుకోవట్లే.. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్
నర్సాపూర్, వెలుగు : అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడంలేదని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిసేందుకు బీజేపీ కౌన్సిలర్లుతో హుజూరాబాద్ కు వెళ్తుండగా ఆయన శివంపేటలో విలేకరులతో మాట్లాడారు. సర్పంచులను సస్పెండ్ చేస్తామని భయపెట్టి పనులు చేయించారన్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే సర్కారు బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులు, టీఆర్ఎస్ లీడర్ల భూకబ్జాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వాగ్దానాలతో దళితులను, తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్, సంఘసాని సురేశ్, గోడ రాజేందర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చిన్న రమేశ్‌గౌడ్, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
మెదక్ టౌన్, వెలుగు : ప్రాణాలకన్నా విలువైనది ఏమీలేదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పలువురు జడ్జీలు సూచించారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో పలువురు పాల్గొని సూచనలు, సలహాలు చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు నుంచి ఐబీ వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, మెదక్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద, సిద్దిపేటలో జడ్జీ భవాని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, నారాయణఖేడ్ లో సివిల్ జడ్జి ప్రియాంక మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, తల్లిదండ్రులు పిల్లలకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే తరచూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.
శిశువులను అమ్మితే కేసులు నమోదు చేస్తాం
నర్సాపూర్, వెలుగు : శిశువులను అమ్మినా, కొన్నా, అలాంటివారికి సహకరించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ అనిత హెచ్చరించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శిశు క్రయవిక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదన్నారు. అందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
గురుకులాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయాలి:మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఈ మేరకు శనివారం స్వచ్ఛ గురుకుల వారోత్సవాల పోస్టర్‌ను ఆమె తన చాంబర్లో విడుదల చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారోత్సవాలు ఈ నెల 5 నుంచి 11 వరకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజూ వివిధ కార్యక్రమాలు చేపట్టి అన్ని గురుకులాలను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాలల సమన్వయాధికారులు, ప్రధానాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటరు నమోదులో భాగస్వాములు కావాలి
ఓటరు నమోదులో స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వాములు కావాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎస్ఎస్ఆర్- 2023 (ఓటరు జాబితా సవరణ)లో భాగంగా ఈ నెల 5 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో స్వయం సహాయక సంఘాల మహిళలను ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానంపై బూత్ లెవల్ అధికారితో సమన్వయం చేస్తూ వారిని భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. శనివారం స్వీప్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నోడల్ అధికారి రాజి రెడ్డి , డీఆర్డీవో పీడీ శ్రీనివాస్‌తో కలిసి ఆమె వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కోహెడ(బెజ్జంకి), వెలుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, కల్లెపల్లి, గూడెం, బేగంపేట, వడ్లూర్ గ్రామాలలో పర్యటించి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజయ్య, రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, లక్ష్మణ్, శేఖర్ బాబు, బోనగిరి శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య
మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: తల్లి మందలించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వంశీ గౌడ్ (18) మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్‌కాలేజీలో ఇంటర్మీడియట్ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జులాయిలా తిరుగుతున్నాడని గతనెల 26న అతడిని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మెదక్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులు చికిత్స పొందాడు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. అయితే శుక్రవారం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే వంశీ బర్త్ డే వేడుకను నిర్వహించగా, తర్వాతి రోజే అతడు చనిపోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
సమస్యల పరిష్కారానికే జడ్పీ స్థాయి సంఘం సమావేశాలు
సిద్దిపేట రూరల్, వెలుగు : క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు జడ్పీ స్థాయి సంఘం సమావేశాలు ఎంతో ఉపయోగ పడుతాయని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్ హాల్లో ఆమె అధ్యక్షతన 1, 5, 6, 7 వ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, అభివృద్ధి ప్రణాళిక పై చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. మంత్రి హరీశ్ రావు చొరవ తో అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశాలలో జడ్పీటీసీ లు ప్రవళిక, లింగాయపల్లి యాదగిరి, సివేరు
సిద్ధప్ప, కుంబాల లక్ష్మి, ఎంబరి మంగమ్మ, వంటేరు సుధాకర్ రెడ్డి, కడతల రవీందర్ రెడ్డి, జడ్పీ కార్యనిర్వహణ అధికారి రమేశ్, సుమతి పాల్గొన్నారు.