వారానికి ఒకరోజు అంగన్​వాడీ డే 

వారానికి ఒకరోజు అంగన్​వాడీ డే 

సంగారెడ్డి టౌన్, వెలుగు: ‘నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. వారంలో ఒక రోజు అంగన్​వాడీ డే నిర్వహించాలి. ప్రతివారం తాను వైద్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తాను. పనితీరు మెరుగుపర్చుకోని   వారిపై చర్యలు తీసుకుంటాం’ అని సంగారెడ్డి కలెక్టర్​ డాక్టర్​శరత్​ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మెడికల్ ఆఫీసర్, సీడీపీవోలు, వైద్యాధికారులు, సూపర్ ​వైజర్లతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పనితీరులో వెనుకబడిన వారిని మందలించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు, నార్మల్ డెలివరీల వివరాలు తెలుసుకున్నారు. వివరాలు చెప్పడంలో తడబడిన వారిన పట్ల అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని ఆఫీసర్లకు కలెక్టర్ సూచించారు. గర్భిణులకు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ బాగుండాలని, ఫార్మసీ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ల్యాబ్ నిర్వహణ బాగుండేలా చూసుకోవాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా, అంగన్​వాడీలు అంకితభావంతో విధులు నిర్వహించాలని, సమయపాలన పాటించాలన్నారు. కోవిడ్​ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ పంపిణీలో వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలు చేసిన కృషిని అభినందించారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్ రాజర్షి షా, డీఅఎం అండ్ హెచ్ వో గాయత్రి దేవి, డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి తదితరులు 
పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీ

సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ వార్డు, ఇతర వార్డులను పరిశీలించి, హాజరు రిజిస్టర్​ను, ఇతర రికార్డులను పరిశీలించారు. ఓపీ, ఫార్మసీ విభాగాల వద్ద బోర్డ్స్ ఏర్పాటు చేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ కు సూచించారు. వార్డులలో బెడ్స్ పై బెడ్ షీట్లు శుభ్రంగా లేకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్యూటీ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్ఎంఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సీలింగ్, ఫ్లోరింగ్ రిపేర్లకు నిధులు మంజూరు చేస్తామని, పనులు చేయించాలని టీఎస్ఎస్​ఐడీసీ ఈఈని ఆదేశించారు.