టీఆర్​ఎస్​ బైక్ ర్యాలీలో..పటాకులు పేలి ఒకరు మృతి

టీఆర్​ఎస్​ బైక్ ర్యాలీలో..పటాకులు పేలి ఒకరు మృతి
  • ఇద్దరికి స్వల్ప గాయాలు
  • సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీలో ఘటన

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి గవర్నమెంట్​ మెడికల్ కాలేజీ ఓపెనింగ్​ సందర్భంగా టీఆర్ఎస్ లీడర్లు చేపట్టిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. పటాకులు పేలి ఒకరు చనిపోగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో నిర్మించిన మెడికల్ కాలేజీ దాకా టీఆర్ఎస్ లీడర్లు భారీ బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు.

బైక్ ర్యాలీ న్యూ కలెక్టరేట్ కు చేరుకుంది. ఆకాశంలో పేల్చే తారా జువ్వ ప్రమాదవశాత్తు పటాకులు ఉన్న ట్రాలీ ఆటోలో పడింది. దీంతో ఒక్కసారిగా పటాకులన్నీ పేలిపోయాయి. ఆటోలో ఉండి పటాకులు పేలుస్తున్న హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన కుశాల్ (20)కు మంటలు అంటున్నాయి. స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. 80శాతం శరీరం కాలిపోయింది.

అదేవిధంగా సుభాశ్, సందీప్ లకు స్వల్ప గాయాలయ్యాయి. కుశాల్​ను హైదరాబాద్​ ఉస్మానియా హాస్పిటల్​కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో ఓ మీడియా కెమెరా మెన్ బైక్ పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా తోపులాట జరగడంతో చింత ప్రభాకర్ కాలికి గాయమైంది. దీంతో మెడికల్ కాలేజీ దాకా కొనసాగాల్సిన ర్యాలీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తర్వాత లీడర్లు వెళ్లి మెడికల్ కాలేజీని ప్రారంభించారు.