టైం ఇయ్యని సీఎం..ప్రారంభంకాని సంగారెడ్డి మెడికల్ కాలేజ్

టైం ఇయ్యని సీఎం..ప్రారంభంకాని సంగారెడ్డి మెడికల్ కాలేజ్

సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభం కోసం ఎదరుచూపులు తప్పడం లేదు. జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) 150 సీట్లు ఖరారు చేసింది. 20కి పైగా ప్రొఫెసర్లు, 42 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను అలాట్ చేసింది. కానీ సీఎం టైం ఇయ్యక ఓపెనింగ్​కు తోచుకోవడం లేదు.  

రూ.21.74 కోట్ల కేటాయింపు.. 

ప్రభుత్వం కాలేజీ నిర్మాణానికి రూ.21.74 కోట్లు కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం క్లాసులు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆఫీసర్లు ఫ్రీ క్యాస్టింగ్ విధానం ద్వారా మూడు అంతస్తుల్లో ఒక విభాగానికి సంబంధించిన బిల్డింగ్ ను త్వరగా నిర్మించారు. ఫిజియాలజీ, అటానమీ, బయో కెమిస్ట్రీ, ల్యాబ్ రూమ్ లు, లైబ్రరీ, లేబరేటరీ గదులు పూర్తయ్యాయి. జనరల్ సర్జన్, ఆర్తో, జనరల్ మెడిసిన్, పీడియాట్రీషియన్, గైనకాలజీ, డెర్మటాలజీతో కలిపి మొత్తం 14 విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. 

సీఎం టైం ఇవ్వకపోవడంతో..

మెడికల్​ కాలేజీ కోసం కొత్తగా నిర్మించిన  బిల్డింగ్ గత నెలలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఓపినింగ్​ కు నోచుకోలేదు. సీఎం వస్తేనే బిల్డింగ్ స్టార్ట్ చేయాలని జిల్లా నేతలు పట్టుబడుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ టైం ఇవ్వట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో చివరి కౌన్సిలింగ్ సమయానికైనా బిల్డింగ్ అందుబాటులోకి వస్తుందో.. లేదోననే సందేహాలు నెలకొన్నాయి. 

1,308 పోస్టులు

సంగారెడ్డిలో ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలో మొత్తం 1,308 పోస్టులు మంజూరు చేశారు. మెడికల్ కాలేజీలో టీచింగ్, నాన్-టీచింగ్ లో 1,200 పోస్టులు, నర్సింగ్ కాలేజీలో 108 పోస్టులు మంజూరయ్యాయి. వీటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక జరగనున్నది. అయితే ఈ రెండు కాలేజీల నిర్మాణాల కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

త్వరలో ఓపెనింగ్... 

మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంసీఐ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో క్లాసులు స్టార్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బిల్డింగ్ ప్రారంభోత్సవంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం క్లాసులు నిర్వహిస్తాం.‌‌‌‌‌‌‌‌ 
- డాక్టర్ వాణి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​