అంచనాల దశలోనే సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ

అంచనాల దశలోనే సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ

సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డి మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా మంజూరైన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణంపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. పాలనపరమైన అనుమతులు జారీ చేసి 10 నెలలు అవుతున్నా బిల్డింగ్​ నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. సంగారెడ్డి టౌన్ రాజంపేట రోడ్డులోని సర్వే నంబర్ 403లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కి అప్పగించారు. బిల్డింగ్ కన్​స్ట్రక్షన్, సివిల్ పనులు చేపట్టేందుకు గత ఫిబ్రవరి 23న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నిర్మాణ పనులు చేయాలని సూచిస్తూ టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు లెటర్ రాశారు. కానీ ఇప్పటివరకు కాలేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోలేదు. నర్సింగ్ కాలేజీ నిర్మాణాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంచనాలపై నిర్లక్ష్యం!

రాష్ట్రంలోని 10 నర్సింగ్ కాలేజీలకు ఒక్కో కాలేజీ బిల్డింగ్​ నిర్మాణానికి సుమారు రూ.40 కోట్ల అంచనాలు రూపొందించినట్లు తెలిసింది.  ఈ మేరకు అధికారిక ఆదేశాలు రాకపోవడంతో టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించలేదని అంటున్నారు.  సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మెడికల్ కాలేజీ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా శాంక్షన్ అయిన గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ నిర్మాణాలు మాత్రం ఇంకా మొదలు పెట్టకపోవడం గమనార్హం. బిల్డింగ్ నిర్మాణానికి 10 నెలల కింద మంజూరు వచ్చినప్పటికీ ఫండ్స్ శాంక్షన్, టెండర్ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. దీంతో పనులు ఇంకెప్పుడు మొదలు పెడతారనే సందేహాలు నెలకొన్నాయి.

టెంపరరీ బిల్డింగ్ లో క్లాసులు.. 

గవర్నమెంట్ నర్సింగ్ స్టూడెంట్స్ కోసం సంగారెడ్డి మహిళా ప్రాంగణంలో టెంపరరీ క్లాసెస్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ (గర్ల్స్) కోర్సులో 60 సీట్లు మంజూరు చేశారు. కాలేజీలో ఇప్పటికే నియమితులైన ప్రిన్సిపాల్, ఏవోలతో పాటు ఐదుగురు లెక్చరర్లు ప్రస్తుత మెడికల్ కాలేజీలోని పాత బిల్డింగ్ లో విధులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ లోగా టెంపరరీ బిల్డింగ్ లో ఏర్పాట్లు పూర్తిచేసి రానున్న జనవరిలో క్లాసెస్ స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల చివరిలోగా   అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. 

బడ్జెట్ కేటాయించలేదు

సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ కోసం ఇంకా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారుల సమక్షంలో ఫస్ట్ ఫేజ్ లో చర్చలు జరిగాయి. త్వరలో సెకండ్ ఫేజ్ లో బడ్జెట్ కేటాయింపులపై తుది నిర్ణయానికి రానున్నట్టు తెలిసింది. జనవరిలో అడ్మిషన్స్ ఉన్నందున మహిళా ప్రాంగణం బిల్డింగ్ లో రెంట్ పద్ధతిలో టెంపరరీగా క్లాసెస్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ తర్వాత తుది ​నిర్ణయం తీసుకుంటారు. 
- పద్మజ, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్