ఆలస్యమైనా అధర్మంపై ధర్మమే గెలుస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మరోసారి నిరూపించింది. జంతర్ మంతర్ వేదికగా ఉద్యమించిన దేశ యువత పోరాటానికి బీజేపీ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో తలొగ్గింది. తమ భవిష్యత్తుకు ప్రాణాలొడ్డి ఉద్యమించిన యువతరానికి కాంగ్రెస్ అడుగుగడుగునా అండగా నిలవడంతో రాజకీయంగా కూడా ఒత్తిడి పెరగడంతో నరంద్ర మోదీ మెడలు వంచాల్సి వచ్చింది. లీకుల కారకులపై చర్యలు తీసుకోవాలని కోరిన విద్యార్థులపై, ప్రతిపక్షాల నేతలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా అమానుషంగా వ్యవహరించింది.
జాతీయ స్థాయి 2026 నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకుతో 20 లక్షల మందికిపైగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కష్టపడి పరీక్ష రాసిన వారిలో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వైఫల్యానికి సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో నైతిక బాధ్యతగా రాజీనామా చేయించాల్సిన మోదీ ప్రభుత్వం ఆయనను వెనకేసుకొని రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెచ్చుకుంది. ఢిల్లీలో ఉద్యమించిన యువతపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జీ చేసి, బాష్ప వాయువు ప్రయోగించి అమానుషంగా వ్యవహరించింది.
ఈ ఘటనలపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరినా ప్రధాని స్పందించ లేదు. దీనిపై ప్రధాని అభిప్రాయం తెలుసుకోవాలనే ఆకాంక్షతో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని ఇంటికెళ్తే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన మోదీ ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతులను నొక్కడానికి ప్రయత్నించడం వారి నియంతృత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. రాహుల్ అరెస్టుకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు చేపడితే పోటీగా బీజేపీ గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడం ఆ పార్టీ ఫాసిస్టు ధోరణికి నిదర్శనం.
ప్రశ్నార్థకంగా యువత భవిష్యత్తు
దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మకం కోల్పోతున్నారు. పేద కుటుంబాలు తమ పిల్లల విద్య కోసం ఆర్థికంగా, మానసికంగా త్యాగాలు చేస్తుంటే పరీక్షల నిర్వహణలో లోపాలు, విద్య వ్యాపారీకరణ, నిరుద్యోగం పెరగడం వంటి పరిణామాలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తరఫున పోరాడాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని జాతీయ చర్చగా మార్చాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను చైతన్యపరుస్తున్నారు.
భారత్‌కు అతిపెద్ద సంపదైన యువతకు సరైన విద్యా వ్యవస్థ, నైపుణ్యాలు, పరీక్షల్లో పారదర్శకత, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ యువశక్తి దేశాభివృద్ధికి బలంగా నిలుస్తుంది. బీజేపీ దీన్ని నీరుగారుస్తూ తమ 12 ఏండ్ల బడ్జెట్లో పాఠశాల విద్యలో 50 శాతం, ఉన్నత విద్యలో 33 శాతం కేటాయింపులు తగ్గించింది. వీరి హయాంలో దేశంలో దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, 43 వేలకుపైగా ప్రయివేట్ పాఠశాలలు ప్రారంభం కావడం విద్య కార్పొరేటీకరణకు నిదర్శనం. మోదీ పాలనలో దేశవ్యాప్తంగా 152 ప్రధాన కోర్సుల ప్రవేశ, నియామక పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులతో 7.5 కోట్ల మందికిపైగా విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు.
విద్యా వ్యవస్థలో సంఘ్ పరివార్ భావాలు
ఉన్నత విద్య, పోటీ పరీక్షలు పూర్తిగా కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాయి. నీట్, జేఈఈ, ఎస్‌ఎస్సీ, ఆర్‌ఆర్బీ, యూపీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు, పరీక్షల ఫీజులు కలిపి ఒక్కో కుటుంబంపై లక్షల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. విద్య అందరికీ సమాన హక్కుగా లభించాల్సి ఉండగా, అది డబ్బున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటోంది.
బీజేపీ విద్యా వ్యవస్థలో సంఘ్ పరివార్ భావాలను జొప్పిస్తూ వీసీలు, అధికారుల నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలిస్తోంది. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించింది.
బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం
విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, పేపర్ లీకులు, నిరుద్యోగం, నియామకాలలో పారదర్శకత కావాలని కోరుతూ విద్యార్థులు ఉద్యమిస్తే ప్రభుత్వం వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉగ్రవాదులపై చర్యలు చేపట్టినట్టు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బెదిరించడం దురదృష్టకరం. విద్యార్థులపై కేంద్రంలో బీజేపీ అణచివేతను దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎండగడుతుంటే తెలంగాణలో బీఆర్‌ఎస్ రాజకీయాలకు ప్రాధాన్యతిస్తూ యువత తరఫున ఉద్యమిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడం విడ్డూరం.
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రాష్ట్రంలో పలు పరీక్ష పేపర్ల లీకేజీలు బహిరంగ రహస్యమే. వారి హయాంలో పదో తరగతి పరీక్షలు మొదలుకొని గ్రూప్1 నియామకాల వరకూ లీకులు జరిగాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తమ కుటుంబ సభ్యులకు రాజకీయ పదవులు ఇచ్చుకున్నారు కానీ యువత ఆశించిన స్థాయిలో నియామకాలు చేపట్టలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో రికార్డు స్థాయిలో 70 వేల నియామకాలు చేపట్టి యువత ఆదరణ చూరగొనడంతో బీఆర్‌ఎస్ అక్కసుతో కాంగ్రెస్‌ను విమర్శిస్తోంది.
పోరాటం ఆగదు
విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జెన్ జీ విద్యార్థులకు చట్టసభల్లో ప్రాధాన్యత లభించేందుకు కృషి చేయాలని నేను కోరగానే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహృదయంతో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయడానికి కనీస వయస్సును 21 ఏళ్లకు కుదిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పడం చారిత్రాత్మకం.
విద్యార్థుల పోరాటంలో ఆసాంతం వారికి అండగా ఉన్న కాంగ్రెస్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తమ క్రెడిట్‌గా చెప్పుకోకుండా విద్యార్థుల విజయంగా ప్రకటించడం పార్టీకి యువత పట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. విద్యార్థులపై అక్రమంగా విధించిన కేసులు ఉపసంహరించుకోవడమే కాకుండా, విద్యార్థులపై విచక్షణా రహితంగా చేసిన దాడులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పేవరకు కాంగ్రెస్ పోరాడుతోంది.
బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
