4 లక్షల మంది బాలికలకు శానిటరీ ప్యాడ్స్.. జులై నుంచి పంపిణీకి కసరత్తు

4 లక్షల మంది బాలికలకు శానిటరీ ప్యాడ్స్.. జులై నుంచి పంపిణీకి కసరత్తు
  • ఆర్కేఎస్కే ద్వారా రాష్ట్రంలో పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ ప్లాన్
  • జులై నుంచి బడులు, కాలేజీల్లో పంపిణీకి కసరత్తు
  • 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు లబ్ధి
  • విద్యార్థినుల్లో ఆరోగ్యం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా ప్యాడ్ల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే నెల జులై నుంచే ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పీరియడ్స్ సమయంలో బాలికలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు పరిశుభ్రతపై వారిలో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, గతంలో ఆర్కేఎస్కే ద్వారా శానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం ఉన్నప్పటికీ.. నిధుల విడుదలలో జాప్యం, టెండర్ల రద్దు, ప్యాడ్ల నాణ్యత తదితర కారణాలతో గత కొన్నేండ్లుగా పంపిణీకి నోచుకోలేదు. 

6 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు.. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్లో శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ స్కూళ్లు, జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఈ ప్యాడ్లను అందజేస్తారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు చదువుతున్న 10 నుంచి 19 ఏండ్లలోపు బాలికలందరికీ ఇవ్వనున్నారు.

ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న విద్యార్థినుల వివరాలను సేకరించిన ఆరోగ్య శాఖ అధికారులు సుమారు 4 లక్షల మంది ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. వారి సంఖ్యకు అనుగుణంగా స్టాక్ పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆర్కేఎస్కే నిధులను వినియోగిస్తూ, నిరంతరం స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనుంది.

చదువులో వెనకపడొద్దని.. 

బాలికల ఆరోగ్యం, వారి అటెండెన్స్ శాతం పెంచడమే లక్ష్యంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక స్థోమత చాలక గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు అపరిశుభ్రమైన బట్టలను వాడుతుంటారు. దీనివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

మరోవైపు, పీరియడ్స్ సమయంలో ఇబ్బందిగా భావించి నెలకు 4 నుంచి 5 రోజులు బడికి రాకుండా సెలవు పెడుతుండటం వల్ల వారి చదువు వెనుకబడుతోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నెలకు ఒక ప్యాకెట్ చొప్పున ప్యాడ్లను, విద్యాశాఖను సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేయనున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా స్కూళ్లలో బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.