IND vs AUS Final: ఫైనల్ ముంబైలో జరిగి ఉంటే గెలిచేవాళ్ళం..నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డ సంజయ్ రౌత్

IND vs AUS Final: ఫైనల్ ముంబైలో జరిగి ఉంటే గెలిచేవాళ్ళం..నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డ సంజయ్ రౌత్

ఆదివారం (నవంబర్ 19) జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమిపై శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కాకుండా ముంబైలోని వాంఖడేలో మ్యాచ్ జరిగి ఉంటే భారతదేశం ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకునేదని రౌత్ చెప్పుకొచ్చారు. 

'రోహిత్ శర్మ కెప్టెన్సీలో మన జట్టు బాగా ఆడి 10 మ్యాచ్ లు గెలిచింది. అయితే, నరేంద్ర మోడీ స్టేడియంలో మనం ఫైనల్‌లో ఓడిపోయాము. ఈ నేపథ్యంలో కొందరు వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగితే మేము గెలిచేవారని కొందరు అంటున్నారు. వరల్డ్ కప్ (ఫైనల్) అహ్మదాబాద్‌లో జరిగింది. అంతకుముందు ముంబై క్రికెట్ మక్కా. ఫైనల్ మ్యాచ్ లన్నీ ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించేవారు. మొత్తం క్రికెట్ ముంబై నుండి అహ్మదాబాద్‌కు తరలించబడింది ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ క్రికెట్‌ను కూడా వదిలిపెట్టదు'. అని రౌత్ ఆరోపించారు.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ కూడా నిర్వహించారు. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, న్యూజి లాండ్ జట్ల మధ్య జరిగిన  ప్రారంభ మ్యాచ్, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సైతం అహ్మదాబాద్ వేదిక కావడం గమనార్హం.   

ఈ ఫైనల్ లో తొలుత భారత బ్యాటర్లను 240 పరుగులకే కట్టడిచేసిన కంగారూ జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విశ్వవిజేతగా అవతరించింది. ఆసీస్ యువ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) ఏకంగా సెంచరీ బాదాడు. అతనికి మరో ఎండ్ నుంచి మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు.