
- తప్పుపట్టిన సుప్రీం బార్ అసోసియేషన్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) సభ్యుడు సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఢిల్లీలో జనరల్ కౌన్సెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీసీఏఐ) ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చడంలో కోర్టుల సెలవులు, రోజువారీ విచారణలు, భాషా వాడకం అడ్డంకిగా మారాయని ఆరోపించారు.
న్యాయ పరిభాషలో వాడుతున్న 'ప్రేయర్', 'మిలార్డ్' అనే పదాలు వారసత్వంగా, ఎన్నో ఏండ్ల క్రితం నాటి హ్యాబిట్‌గా మారిందని విమర్శించారు. దేశ లీగల్ ఫౌండేషన్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ ఫోరంలో పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఈ ఈవెంట్‌లో సంజీవ్ సన్యాల్ కామెంట్లను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ తప్పుపట్టారు.
"సన్యాల్ కామెంట్లు బాధ్యతారాహిత్యం. ఎవరైనా కోర్టుల సెలవులను తప్పుపట్టారంటే.. కోర్టుల పనితీరుపై వారికి అవగాహనలేనట్లే. భారత్ అభివృద్ధికి న్యాయవ్యవస్థే అడ్డంకి అనడం బాధాకరం. సిస్టమ్‌లోని చాలా సమస్యలు ప్రభుత్వం వల్లే పుట్టుకొస్తున్నాయి. జడ్జియరీని మాత్రమే బ్లేమ్ చేయడం అన్యాయం. జడ్జిలు వీకెండ్‌లలో కేసు ఫైళ్లు చదువుతారు. తీర్పు లు రాస్తారు. సెలవులు లేకపోతే 'బర్నౌట్' సమస్య వస్తుంది.
ఒక బిజీ లాయర్, జడ్జి సాధారణ సమయాల్లో ఏంచేస్తారో తెలుసుకుంటే ఎవరూ ఇలా మాట్లాడరు. మై లార్డ్, యువర్ లార్డ్ షిప్ వంటి పదాలను మార్చవచ్చు" అని కౌంటర్ ఇచ్చారు.