ఇంటర్ లో సంస్కృతం రెండో భాష తప్పనిసరి కాదు

ఇంటర్ లో సంస్కృతం రెండో భాష తప్పనిసరి కాదు
  • ఆప్షన్ మాత్రమే:  ఇంటర్మీడియట్ బోర్డు
  • సంస్కృత లెక్చరర్ల వినతిని పరిశీలించమని కాలేజీలకు సిఫారసు చేశామంతే
  • తప్పనిసరి ఉత్తర్వు కాదు: ఇంటర్మీడియట్ బోర్డు 

హైదరాబాద్: జూనియర్ కాలేజీలలో సంస్కృతాన్ని రెండవ భాషగా ప్రారంభించడం గురించి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ వివరణ ఇచ్చారు. కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సంస్కృతం రెండో భాష తప్పనిసరి అంటూ ఉత్తర్వులిచ్చినట్లు ప్రసారం జరగడంతో వెంటనే స్పందించారు. సంస్కృతం భాషను ప్రోత్సహించాలని.. తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ సంస్కృత లెక్చరర్స్ అసోసియేషన్, హైదరాబాద్ లోని తెలంగాణ సంస్కృత పరిశోధనా పండితులు మరియు విద్యార్థుల సంఘం నుండి వచ్చిన అభ్యర్థన పరిశీలించడానికి కాలేజీలకు పంపామన్నారు. సంస్కృతాన్ని రెండవ భాషగా ప్రవేశపెట్టవలసిన అవసరాన్ని గుర్తించాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అభ్యర్థిస్తూ ఒక మెమో జారీ చేయబడిందన్నారు. 
ఈ సర్క్యులర్ రిఫరెన్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో డిమాండ్‌ను గుర్తించే విషయం మాత్రమే తప్ప కొత్త రెండవ భాషను ప్రారంభించే ఆర్డర్ కాదని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ స్పష్టం చేశారు. తమ మెమోను ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సంస్కృతాన్ని రెండవ భాషగా ప్రారంభించాలనే ఆదేశాలుగా  చూడొద్దని ఆయన సూచించారు. ఏదైనా రెండవ భాషను ప్రారంభించాలంటే అవసరమైన జూనియర్ లెక్చరర్ పోస్టుల మంజూరు వంటి తగిన ప్రక్రియ చేయవలసిన అవసరం వుంటుందని కమిషనర్ గుర్తు చేశారు.