నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ గుడిని బడిగా చేసిన్రు

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ గుడిని బడిగా చేసిన్రు

పిల్లలకు చదువు చెప్పించాలని ఆ ఊరి తల్లిదండ్రుల కోరిక. కానీ, బడి చూస్తే.. ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం. ‘ఏదేమైనా చదువు ఆగకూడదు’ అని గుడిని బడిగా చేశారు. అది కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఎండాకాలంతోపాటు వానాకాలం కూడా సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ, సమస్య అంత పెద్దదైనా, పట్టించుకోవాల్సిన వాళ్లే వదిలేసినా.. ఆ ఊరికి ఇప్పుడు మోడల్ స్కూల్ వచ్చింది. పిల్లల చదువు ఇప్పుడు ఆటంకం లేకుండా సాగుతోంది. అదెలాగో ఈ స్టోరీల్లో చదవండి. 

అది నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం, రవీంద్ర నగర్ గ్రామం. ఆ గ్రామంలో ఒక బడి ఉండేది. అందులో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్నాయి. అక్కడ మొత్తం30 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్లంతా రోజూ సంతోషంగా బడికి వెళ్లొచ్చేవాళ్లు. అలా ఉండగా, కొంతకాలానికి ఆ బడి పాతదైపోయింది. కొద్దిరోజులుగా పూర్తిగా శిథిలాస్థకు చేరింది. ఇక అక్కడ పాఠాలు చెప్పడం కష్టమని అర్థమైంది. దాంతో కొత్త బిల్డింగ్​ కోసం అధికారులకు స్కూల్​ పరిస్థితి గురించి చెప్పారు గ్రామస్తులు. కానీ, ఫలితం కనిపించలేదు. చేసేదేం లేక దగ్గరలో ఉన్న గుడినే బడిగా మార్చి అందులో కొన్నాళ్లు చదువు చెప్పారు. అలాగైనా పిల్లల చదువు కొనసాగుతోంది అని తల్లిదండ్రులు సంతోషించేలోపు మరో సమస్య ఎదురైంది. గుడిలో చదువు బాగానే కొనసాగింది. కానీ, వానాకాలంలో నీళ్లు లోపలికి వచ్చేవి. పిల్లలు కూర్చోవడానికి, టీచర్లు పాఠాలు చెప్పడానికి వీలుండేది కాదు. దాంతో వానపడ్డ రోజులన్నీ సెలవులే. ఇలాగే ఉంటే పిల్లల చదువులు పాడవుతాయని, వాళ్ల తల్లి దండ్రులు దిగులుపడేవాళ్లు. ఇంత జరుగుతున్నా, కొత్త బిల్డింగ్​ గురించి మాత్రం ఊసే లేదు. 

రంగంలోకి యువత

కళ్లముందే ఇంత పెద్ద సమస్య కనిపిస్తున్నా, ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ ఊరి యువకులు ముందుకొచ్చారు. వాళ్లలో ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ అయిన హర్షవర్దన్​. అతని ఫ్రెండ్స్ రాజ్​ కుమార్, రాహుల్, రాకేష్​, అజారుద్దీన్, పవన్​ కుమార్, శివసాయి, ప్రవీణ్​ కలిసి, పిల్లల కోసం ఒక మోడల్ స్కూల్ కట్టాలి అనుకున్నారు. అందుకోసం తలా కొంత డబ్బు పోగు చేశారు. తక్కువ ఖర్చుతో పిల్లలను ఆకర్షించేలా బడి కట్టాలి అనుకున్నారు. అనుకున్నట్లుగానే, బిల్డింగ్​ను డిజిటల్ స్కూల్​లా కట్టారు. అందులో ఒక ప్రొజెక్టర్, బోర్డులు, కుర్చీలు వంటి సౌకర్యాలు సమకూర్చారు. అలాగే అక్షరమాల, లెక్కలు, ఇంగ్లీష్​, హిందీ సబ్జెక్ట్​లకు సంబంధించిన వర్ణమాలను కూడా డిజిటల్​ పద్ధతిలో రాయించారు. అంతేకాదు, స్కూల్​ బయట గోడలపై జాతీయ నాయకుల ఫొటోలను ఫ్లెక్సీల రూపంలో పెట్టారు. కాంపౌండ్​ కూడా తీగలతో అందంగా ఏర్పాటుచేశారు. బడి బయట ఆవరణలో మువ్వన్నెల రంగులతో చేతి పంపు కూడా ఉంది. అన్ని సౌకర్యాలతో కొత్త బడి త్వరగానే పూర్తైంది. కొద్దిరోజుల కిందటే ఈ స్కూల్​ని గ్రామస్తులే ప్రారంభించారు. ఇప్పుడు పిల్లలు కూడా ఈ స్కూల్​ని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. క్రమం తప్పకుండా స్కూల్​కి హాజరవుతున్నారు. 

::: జల్ద మనోజ్​ కుమార్​

నిర్మల్​, వెలుగు