
జయశంకర్ భూపాలపల్లి/మహదేవ్‌పూర్, వెలుగు : కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కరాల్లో ఆరోరోజైన మంగళవారం సైతం తెలంగాణతో పాటు ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే కాళేశ్వరానికి చేరుకున్న భక్తులు ‘కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం’ అంటూ త్రివేణి సంగమంలో పుష్కర స్నానమాచరించారు.
అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సరస్వతీ నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీరోజు ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు అరగంట పాటు సాగే సరస్వతీ నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులు ఇస్తారు.