ENG vs IND: 50 మంది ఆటగాళ్లను ఎంచుకోలేము: ఆ ఒక్కడికి అన్యాయం చేసిన టీమిండియా సెలక్టర్లు

ENG vs IND: 50 మంది ఆటగాళ్లను ఎంచుకోలేము: ఆ ఒక్కడికి అన్యాయం చేసిన టీమిండియా సెలక్టర్లు

ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును శనివారం (మే 24) ప్రకటించారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం 18 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో హిట్ మ్యాన్ స్థానంలో శుభమాన్ గిల్ ను కొత్త కెప్టెన్ గా ఎంపిక చేశారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు. 18 మంది స్క్వాడ్ లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఏడాదిగా టీంఇండియాలో కొనసాగుతున్న అతనికి టెస్ట్ జట్టులో స్థానం లభించకపోవడం విచారకరం.

మొన్నటి వరకు టెస్ట్ స్క్వాడ్ లో లేని సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మీద నమ్మకముంచిన సెలక్టర్లు సర్ఫరాజ్ కు మాత్రం అన్యాయం చేశారనే చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఈ ముంబై బ్యాటర్ కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా స్క్వాడ్ లో సర్ఫరాజ్ కు చోటు దక్కకపోవడం విమర్శలకు దారి తీస్తుంది.

ALSO READ | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన కోహ్లీ: టీ20 క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్‎గా అరుదైన ఘనత

ఇంగ్లాండ్ సిరీస్ కోసం సర్ఫరాజ్ కఠినమైన డైట్ ప్లాన్ చేసి 10 కిలోల బరువు తగ్గాడు. అతను ఫిట్ గా ఉండటానికి ఉడికించిన కూరగాయలు తిన్నాడు. చికెన్ పూర్తిగా మానేసి ఫిట్ నెస్ పై ఫోకస్ చేశాడు. ఫిట్ నెస్ తో పాటు నెట్స్ లో తీవ్రంగా శ్రమించాడు. రోజుకు రెండు పూటలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆఫ్-స్టంప్ బయట పడిన బంతులని ప్రాక్టీస్ చేస్తూ బిజీగా మారాడు. శుక్రవారం (మే 16) ఇండియా ఎ జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు అవకాశం వస్తుందని భావించినా నిరాశ తప్పలేదు. 

సర్ఫరాజ్ ను తప్పించడం పట్ల చీఫ్ సెలక్టర్ అగార్కర్ స్పందించాడు. "మేము ఇప్పుడు 50 మంది ఆటగాళ్లను ఎంచుకోలేము. 18 మంది ఆటగాళ్లను ఎంచుకోవలసి వచ్చినప్పుడు కొంతమంది ఆటగాళ్ళు సహజంగానే ఈ అవకాశాన్ని కోల్పోతారు" అని అగార్కర్ అన్నారు.సర్ఫరాజ్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఓవరాల్ గా ఈ ముంబై బ్యాటర్  ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు.

ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్