మంచు కొండల మధ్య టూరిస్ట్ గ్రామం

మంచు కొండల మధ్య టూరిస్ట్ గ్రామం

తెల్లని మంచు దుప్పట్లు కప్పుకున్న పంచచూలి పర్వతాలు... వాటి నడుమ పారుతున్న గోరీ గంగా నది... పచ్చని చెట్ల మధ్య ఉన్న ఇళ్లు... ఇలాంటి ప్రశాంత వాతావరణం చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా. ఇవన్నీ చూడాలంటే ఉత్తరాఖండ్​లో మంచు పర్వతాల మధ్య ఉన్న సర్మోలి విలేజ్​కు వెళ్లాలి. ఇక్కడ టూరిస్టులకు కావాల్సిన వసతులతో హోం స్టేలు. అడ్వెంచర్​ లవర్స్​కోసం ట్రెక్కింగ్ స్పాట్స్​ ఉన్నాయి.

ఉత్తరాఖండ్‌‌‌‌లోని కుమావోన్ ప్రాంతంలో, మున్సియరి సబ్​ డివిజన్​లో ఉన్న ఒక చిన్న గ్రామం సర్మోలి. ఇది టిబెట్​, నేపాల్‌‌‌‌ సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. దాంతో కొన్నేళ్ల కిందట ఈ ప్రాంతానికి టిబెట్​కి  చెందిన భూటియా కమ్యూనిటీ ప్రజలు వచ్చారు. జీవనోపాధి కోసం వచ్చిన వాళ్లు, ఎవుసం చేస్తూ జీవించారు. కొన్నేళ్ల తర్వాత ప్రకృతి అందాలను చూడ్డానికి సిటీ ప్రజలు క్యూ కట్టారు. టూరిస్టు​లు పెరగడంతో టూరిస్ట్ డెస్టినేషన్​ ప్లేస్​గా మారిపోయింది.1990 మధ్య కాలంలో అక్కడికి వెళ్లిన కొందరు టూరిస్టు​లు కొన్ని రోజులు అక్కడే ఉండేవాళ్లు.  అయితే, వాళ్లకి బస సరిగాలేక ఇబ్బంది పడేవాళ్లు. ఒకసారి విర్ది, థియొఫిలస్​ అనే జంట ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకుని, టూరిస్ట్​లకు కొన్ని గదులు కిరాయికి ఇచ్చారు. అక్కడే స్థిరపడిన విర్ది 2003లో సర్పంచ్​గా గెలిచింది. అప్పుడామె13 ఫ్యామిలీలతో గెస్ట్​ హౌస్​లు ఏర్పాటు చేసింది. ఆ ఐడియా సక్సెస్​ కావడంతో ఇది టూరిస్ట్ ప్లేస్​గా ఫేమస్​ అయింది. పోయినేడాదికి ఇలాంటి గెస్ట్​ హౌస్​లు నిర్వహించే ఫ్యామిలీలు మొత్తం 25 అయ్యాయి.

పండుగలో మారథాన్
ఇక్కడ ‘‘హిమల్ కాలసూత్ర’’ అనే పండుగ చేస్తారు. ఈ పండుగ వారం రోజులు జరుగుతుంది. ఈ సందర్భంగా, స్థానికులంతా కలిసి20 కిలోమీటర్ల మారథాన్‌‌‌‌లో పార్టిసిపేట్ చేస్తారు. రకరకాల పక్షుల్ని, వాటి గూళ్లను గుర్తించడం ఇందులో స్పెషాలిటీ. ఫొటోగ్రఫీ వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లు, బటర్​ ఫ్లై ఫెస్టివల్, బర్డ్​ ఫెస్టివల్, ఫారెస్ట్ ఫెయిర్​లను కూడా సమ్మర్​ టూర్​లో చూడొచ్చు. వీటితో పాటు ‘‘హిమాలయన్​ ఆర్క్’’​ అనే వర్క్​ షాప్ కూడా ఉంటుంది. దీన్ని ‘‘షి మూవ్స్​ మౌంటెన్స్’’ అని కూడా అంటారు. ఇందులో సర్మోలి ఊరి ఆడవాళ్లు, సిటీ ఆడవాళ్లు కలిసి పార్టిసిపేట్ చేస్తారు. సర్మోలి ఊరి ఆడవాళ్లు, సిటీ వాళ్లతో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటారు. దాంతోపాటు చేతి పనులు, ఎవుసం, వెరైటీ వంటకాలు ఎలా చేయాలో ఒకరికొకరు నేర్పించుకుంటారు.  పనులతో పాటు, ట్రెక్కింగ్ చేసిన ఎక్స్​పీరియెన్స్​లను పంచుకుంటారు.

అచ్చం ఇంట్లో ఉన్నట్టే
మున్సియారి మెయిన్​ మార్కెట్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో విడిది చేయడానికి అన్ని వసతులున్నాయి. టెర్రస్ మీద నుంచి చూస్తే అందమైన పంచచూలి పర్వతాలు కనిపిస్తాయి. హిమాలయ సీతాకోక చిలుకలు, చిమ్మటలు, పక్షుల్ని చూడ్డానికి... వాటి గురించి తెలుసుకోవడానికి కూడా ఇది బెస్ట్​ ప్లేస్. ఈ గెస్ట్​ హౌస్​లు డైనింగ్ ఏరియా, మోడర్న్​, హైజెనిక్​ బాత్రూమ్‌‌‌‌లు, వెచ్చదనాన్నిచ్చే బెడ్​లు, డబుల్ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లతో ఉంటాయి. కాకపోతే కిచెన్​ ఉండదు. వాళ్లే వండి వడ్డిస్తారు. తినడానికి పొద్దున బ్రేక్​ ఫాస్ట్​కి పొయ్యి మీద కాల్చిన చపాతీ, భుమ్లా, ఫ్రూట్స్, భాంగ్ కి చట్నీలు ఉంటాయి. వాటితోపాటు అల్లం – మిరియాలతో చేసిన టీ ఇస్తారు. లంచ్, డిన్నర్‌‌‌‌లో రాజ్‌‌‌‌మా దాల్, భట్ కి చుర్కానీ, సర్సన్ పట్టా, ఆలు కే గుట్కే వంటి లోకల్​ ఫుడ్ పెడతారు. సీజన్​ను బట్టి వాళ్లేం పండిస్తారో ఆ వంటకాలే వండుతారు. 

ట్రెక్కింగ్​ కోసం...
సర్మోలిలో పర్వతాలు, పండుగలు, వాళ్ల బ్యూటిఫుల్ కల్చర్​తో పాటు అడ్వెంచర్స్​ని ఇష్టపడేవాళ్ల కోసం సర్మోలిలో ట్రెక్కింగ్ ప్లేస్​లు చాలా ఉన్నాయి. అయితే వీటిలో స్మాల్, లాంగ్ ట్రెక్స్​ అని రెండు రకాలు ఉంటాయి. 

స్మాల్ ట్రెక్​లు
ధంధర్ రిడ్జ్ : చిన్నవాటిలో  ప్రధానమైంది ధంధర్ రిడ్జ్ ట్రెక్. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ పర్వతాలు, గోరి గంగా నది కనిపిస్తాయి. ఈ పర్వతం పైన ఆలయం కూడా ఉంటుంది. 
ఖలియా టాప్ : ఇది నాలుగు  కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఖలియా టాప్ చేరుకోవడానికి 4 రోజులు పడుతుంది. పైకి చేరుకున్నాక, రాజ్రంభ, హర్డియోల్, నందా దేవి, నందా కోట్, పంచచూలి వంటి మంచు పర్వతాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు ఇక్కడ 2,200 పూల మొక్కలు, 36 పాలిచ్చే జంతువులు, 326 పక్షి జాతులున్నాయి. శీతాకాలంలో టూర్ వెళ్లాలనుకునే  వాళ్లకి ఇది బెస్ట్ చాయిస్​. 
మహేశ్వరి కుండ్ : దీన్నే ‘మెస్సార్ కుండ్’ అని కూడా పిలుస్తారు. ఇది మున్సియరిలోని ఒక అందమైన సరస్సు. ఇది 2,450 మీటర్ల ఎత్తులో ఉంది. ట్రెక్కింగ్ చేస్తే ఒకటిన్నర కిలో మీటర్ల దూరాన్ని కవర్ చేయొచ్చు. అందుకు ముప్పావు గంట పడుతుంది. దీని వెనక ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే... గ్రామ పెద్ద కూతురితో ఒక యక్షుడు ప్రేమలో పడతాడు. వాళ్ల పెండ్లికి గ్రామ పెద్ద ఒప్పుకోడు. అంతేకాకుండా యక్షుడు నివసించే ప్రదేశంలో  చెరువు (కుండ్‌‌‌‌) ఎండిపోయేలా చేస్తాడు. దాంతో కోపగించిన యక్షుడు ఆ గ్రామాన్ని, కుండ్‌‌‌‌ను కరవుతో ఉండాలని శపిస్తాడు. కొన్నేళ్ల పాటు కరవుతో బాధపడిన ప్రజలు, గ్రామ పెద్ద చేసిన పనికి యక్షుడికి వాళ్లంతా క్షమాపణ చెప్తారు. దాంతో యక్షుడు పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకుంటాడు. అప్పటినుంచి అది మళ్లీ నీళ్లతో కళకళలాడిందని చెప్పుకుంటారు.

నందా దేవి టెంపుల్ ట్రెక్ :‘‘వరల్డ్ హెరిటేజ్ సైట్​”గా పిలిచే నందా దేవి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉంది. మూడు కిలో మీటర్ల ట్రెక్కింగ్ తర్వాత నందా దేవి టెంపుల్​కి  చేరుకోవచ్చు. ఇది ఉత్తరాఖండ్‌‌‌‌లో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి.

లాంగ్ ట్రెక్​లు
నందా దేవి ఈస్ట్ బేస్‌‌‌‌ క్యాంప్ ట్రెక్ : మనదేశంలో రెండో ఎత్తైన పర్వత శిఖరం నందా దేవి. మున్సియరి ఉత్తరాఖండ్‌‌‌‌లోని ఈ శిఖరానికి తూర్పు వైపున నందా దేవి బేస్‌‌‌‌క్యాంప్ ఉంది. ఇది 13,123 అడుగుల ఎత్తులో15 కిలో మీటర్ల పొడవైన ట్రెక్. దీన్ని పూర్తి చేయడానికి దాదాపు పన్నెండు రోజులు పడుతుంది.
మిలామ్ గ్లేసియర్ ట్రెక్ : ఇది కుమావో ప్రాంతంలో ఉన్న అతిపెద్ద మంచు పర్వతం. ఈ ట్రెక్ పూర్తి చేయడానికి ఎనిమిది రోజులు పడుతుంది.

వర్షాకాలంలో తప్ప.. 
మార్చి నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్,  నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడికి వెళ్లొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే... దాదాపు సంవత్సరమంతా సర్మోలి విలేజ్​కి వెళ్లొచ్చు​. చలిని తట్టుకోలేని వాళ్లు వేసవిలో వెళ్లొచ్చు. మంచు పర్వతాల అందాలను చూడాలనుకునేవాళ్లు వింటర్​లో టూరేయొచ్చు. వర్షాకాలంలో మాత్రం కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది. కాబట్టి జూలై, ఆగస్టు నెలల్లో వెళ్లకపోవడమే బెటర్​. 

ఇలా వెళ్లొచ్చు
కత్గోడంలో క్యాబ్​లో మున్సియరి మీదుగా సర్మోలికి వెళ్లాలి. ఈ జర్నీ సుమారు10 గంటలు పడుతుంది. కావాలంటే కత్గోడంలో క్యాబ్​లు అద్దెకు దొరుకుతాయి. సర్మోలి నుండి 280 కిలో మీటర్ల దూరంలో కత్గోడం రైల్వే స్టేషన్ ఉంది. ఫ్లైట్​లో వెళ్తే... 366 కిలో మీటర్ల దూరంలో పంత్‌‌‌‌నగర్ ఎయిర్​పోర్ట్ ఉంది.