
హైదరాబాద్: మొక్కజొన్న వ్యాపారి నాగభూషణం కిడ్నాప్ కేసును ఛేదించారు సరూర్ నగర్ పోలీసులు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ లో మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణం ను అజీజ్ గ్యాంగ్ సభ్యులు కిడ్నాప్ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ లను పట్టుకొని అరెస్టు చేశామని మీడియాకు వెల్లడించారు.
రాజ్ భూషణ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్ కు ప్రధాన సూత్రధారి అని సీపీ తేల్చారు. రాజ్ భూషణ్ , నాగభూషణం మధ్య వ్యాపార లావాదేవీల గొడవలు ఉన్నాయని అన్నారు.’ రైతుల నుంచి భారీగా మొక్క జొన్నలు కొనుగోలు చేసిన రాజ్ భూషణ్ వాటిని నాగభూషణం కు విక్రయించాడు. ఈ లావాదేవిల్లో రాజ్ భూషణ్ కు నాగభూషణం 2 కోట్ల 80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. ఎన్ని సార్లు అడిగినా డబ్బులివ్వకపోవడం తో రాజ్ భూషణ్ కిడ్నాప్ కు ప్లాన్ చేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన రౌడీ షీటర్ అజీజ్ గ్యాంగ్ తో రూ.10 లక్షల కు సుపారి మాట్లాడి నాగభూషణాన్ని కిడ్నాప్ చేయించాడు అని మీడియాకు తెలిపారు.
పోలీసులు 24 గంటలు గడవకముందే కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. జగిత్యాల పోలీసుల సహకారంతో గ్యాంగ్ కు చెందిన అబ్దుల్ అజీజ్, సునీల్ పాటిల్, నిఖిల్ సింగ్, రాజేష్ లను అరెస్ట్ చేశారు. ఈ సుపారి గ్యాంగ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రధాన నిందితుడు రాజ్ భూషణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అన్నారు.