సంగారెడ్డి జిల్లా పీపడ్‌‌‌‌పల్లిలో స‌‌‌‌ర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

సంగారెడ్డి జిల్లా పీపడ్‌‌‌‌పల్లిలో స‌‌‌‌ర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌
  • తన ఓటమికి కుట్ర చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు

రాయికోడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌‌‌‌ మండలం పీపడ్‌‌‌‌పల్లి గ్రామ సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాల్కి రాజు (36) కాంగ్రెస్‌‌‌‌ తరఫున సర్పంచ్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌గా నామినేషన్‌‌‌‌ వేశాడు. అయ్యప్ప మాలలో ఉన్న రాజు మండలంలోని శంశొద్దీన్‌‌‌‌పూర్‌‌‌‌ గ్రామ శివారులో స‌‌‌‌న్నిధానం ఏర్పాటు చేసుకొని తోటి మాలధారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 

ఆదివారం రాత్రి అక్కడే పడుకున్న రాజు.. సోమవారం తెల్లవారుజాము నాలుగు గంట‌‌‌‌లకు బ‌‌‌‌య‌‌‌‌ట‌‌‌‌కు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మాలధారులంతా తిరిగి వచ్చినా.. రాజు మాత్రం సన్నిధానానికి రాలేదు. మిగతా వారు చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో శంశొద్దీన్‌‌‌‌పూర్‌‌‌‌ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కొందరు గ్రామస్తులు సన్నిధానం వద్దకు చేరుకొని చుట్టుపక్కల వెతకగా.. ఓ చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. 

దీంతో రాజు కుటుంబ సభ్యులకు, రాయికోడ్‌‌‌‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంగారెడ్డి ఏఎస్పీ ర‌‌‌‌ఘునంద‌‌‌‌న్‌‌‌‌రావు, జ‌‌‌‌హీరాబాద్‌‌‌‌ డీఎస్పీ సైదా, రూర‌‌‌‌ల్ సీఐ హన్మంత్‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా, సర్పంచ్‌‌‌‌గా పోటీ చేస్తున్న రాజుకు వ్యతిరేకంగా దగ్గరి వాళ్లే కుట్ర చేస్తున్నారని, దీంతో తాను ఓడిపోతానన్న మనస్తాపంతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని రాజు భార్య శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైత‌‌‌‌న్య కిరణ్‌‌‌‌ తెలిపారు.