వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సర్పంచ్ కుటుంబం ఇంట్లో ఉండగానే బయట నుంచి తాళం వేసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం (మార్చి 24) రూప్ సింగ్ తాండా సర్పంచ్ రమణి భాయ్ కుటుంబంపై హత్యాయత్నం జరిగింది. తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనార్ సింగ్ అనే వ్యక్తి. నిద్రలో ఉన్న సమయంలో నిప్పంటించడంతో.. పడుకున్న చోటే సర్పంచ్ రమణి భాయ్, భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేష్ లకు నిప్పంటుకొని తీవ్ర గాయాలపాలయ్యారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు చెప్పారు. గాయపడిన వారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలే దాడికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రమణి భాయ్ భర్త హన్మంత్ నాయక్ కు ఇద్దరు భార్యలు. ఇటీవలే మొదటి భార్య నాతిభాయ్ మరణించింది. నాతిభాయ్ పేరిట 5 లక్షల రూపాయల రైతుభీమా మంజూరయ్యింది. దీంతో భీమా డబ్బులపై కుటుంబంలో కలహాలు మొదలైనట్లు పోలీసులు చెప్పారు.
నాతిభాయ్ కి ఇద్దరూ కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు వివాహమవ్వగా చిన్న కుమారుడు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. పెద్ద కుమారుడు అనార్ సింగ్ రైతు భీమా, ఆస్తి కోసం తండ్రితో గొడవ పడుతున్నాడు. అనార్ సింగ్ అభ్యర్థనను తండ్రి హన్మంత్ నాయక్ పట్టించుకోకపోవడంతో దాడి చేసేందుకు ప్లాన్ వేశాడు.
పథకం ప్రకారం మంగళవారం (మార్చి 24) కుటుంబం అంతా ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో ఇంటికి నిప్పంటించాడు అనార్ సింగ్. ఇంటి మెయిన్ డోర్ కు తాళం వేసి పైకప్పు కు ఉండే రంధ్రం (గవాసు) నుంచి పెట్రోల్ పోసి నిప్పంచడంతో పెద్ద ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడం చూసి తాండావాసులు పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే గ్రామస్థులు తలుపులు పగలగొట్టి తీవ్ర గాయాలపాలైన సర్పంచ్ కుటుంబ సభ్యులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెజిస్ట్రేట్ వాంగ్మూలం అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు అనార్ సింగ్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
