సత్తుపల్లిలో రూ.36 కోట్లతో 100 పడకల ఆస్పత్రి సిద్ధం .. ప్రారంభమెప్పుడో?

సత్తుపల్లిలో రూ.36 కోట్లతో 100 పడకల ఆస్పత్రి సిద్ధం .. ప్రారంభమెప్పుడో?
  • కొత్తది ముస్తాబైనా పాత దాంట్లోనే చికిత్స
  • శిథిలావస్థకు చేరి కురుస్తున్న పాత భవనాలు 
  • మళ్లీ వర్షాలు ప్రారంభమైతే పేషెంట్లకు కష్టాలే

ఖమ్మం/ సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొత్తగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాదాపు మూడు నెలల కింద పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ భవనాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులకు హ్యాండోవర్ చేసినా, ఇంకా దాదాపు 50 ఏండ్ల కిందటి భవనంలోనే పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు వర్షాకాలంలో కురుస్తుండడం, అప్పుడప్పుడు పెచ్చులూడి పడుతుండడంతో గత ప్రభుత్వ హయాంలో కొత్త దాన్ని మంజూరు చేశారు.

 2022లో రూ.36 కోట్లతో అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడాది కింద మూడు అంతస్తుల్లో ఐదు ఆపరేషన్ థియేటర్లు, 19 వార్డులతో లక్షా పాతిక వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం పూర్తయింది. ఒకేసారి 100 మందికి చికిత్స చేసేలా ఆక్సీజన్​ బెడ్స్​ తో పాటు, 98 నార్మల్ బెడ్స్, ఐదు ఐసీసీయూ బెడ్స్, స్కానింగ్ మిషన్, ఎక్స్ రే మిషన్ సహా వైద్యానికి సంబంధించి కార్పొరేట్ హంగులతో అత్యాధునిక సామగ్రి కూడా వచ్చింది. ఇన్ పేషెంట్లకు తగిన సౌకర్యాలు, స్పెషలైజేషన్ వారీగా ఔట్ పేషెంట్ రూములు, డయాలసిస్ కేంద్రాన్ని కూడా సెటప్ చేశారు. 

 పాత భవనంలోనే ఉంటే వర్షా కాలం తిప్పలే..

ప్రస్తుతం సేవలందిస్తున్న పాత ఆస్పత్రి భవనాన్ని 1976లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించగా, 1978లో 50 పడకల ఆస్పత్రిగా మార్చారు. 46 ఏండ్ల నుంచి లక్షలాది మంది ప్రజలకు సేవలందించిన ఈ భవనం పురాతన దశకు చేరడంతో, 2022లో అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొత్తదాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. 2022 జనవరిలో మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​ భూమి పూజచేశారు. అప్పటి నుంచి పనులు జరుగుతుండగా, కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను స్పీడప్​ చేశారు. దీంతో మూడు నెలల కింద పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. 

అయితే ఇంకా ఆస్పత్రిని ప్రారంభించకపోవడంతో ప్రస్తుతం ఉన్న పాత ఆస్పత్రిలోనే పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి వర్షాకాలం ప్రారంభం కానుండగా పాత ఆస్పత్రిలో వైద్యం, ఆపరేషన్లు, డయాలసిస్, ఇన్ పేషెంట్ రోగుల తిప్పలు రెట్టింపు కానున్నాయి. ఇకనైనా నూతన ఆస్పత్రి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు. అయితే ప్రాథమికంగా అన్ని వనరులతో 100 పడకల ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైందని, మరిన్ని సౌకర్యాలకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఉన్నతాధికారులకు పంపించామని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త భవనం ప్రారంభం ఉంటుందని అంటున్నారు.