నింగిలోకి విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం

నింగిలోకి విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం

తిరుపతి : తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో చరిత్రాత్మక ప్రయోగానికి వేదికైంది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)  నుంచి రాకెట్ ను ప్రయోగించారు. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు షార్ లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి విక్రమ్- S ను పంపించారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ హాజరయ్యారు.  ఈనెల 12వ తేదీన ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌.. సింగిల్‌ స్టేజ్‌ సబ్‌-ఆర్బిటల్‌ లాంచ్‌ వెహికల్‌ కావడం ప్రత్యేకత. ఈ రాకెట్‌ మూడు పేలోడ్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఈ రాకెట్ కు విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ, విక్రమ్‌ -సబ్ ఆర్బిటల్(వీకేఎస్‌) ఈ ప్రైవేటు రాకెట్‌ను రూపొందించాయి. సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు విక్రమ్–ఎస్ ను అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది ప్రయోగించబోతున్న విక్రమ్-1 ఆర్బిటాల్ వాహనంలో ఉపయోగించే 80% సాంకేతికతలను ధృవీకరించడంలో ఈ ప్రైవేటు రాకెట్ ఉపయోగపడనుంది. ఇది మూడు కస్టమర్ పేలోడ్‌లను కలిగి ఉంటుంది. 

అంతరిక్ష రంగంలో అడుగుపెట్టేందుకు ప్రైవేటు రంగానికి మన దేశంలో రెండేళ్ల క్రితమే అనుమతి లభించింది. అప్పటి నుంచి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఈ రాకెట్‌ అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. చాలా తక్కువ ఖర్చుతో, రెండేళ్లలోనే ఈ రాకెట్‌ను తయారుచేసినట్లు సంస్థ సీఈఓ పవన్‌ కుమార్‌ గతంలో వెల్లడించారు. మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌కి నివాళిగా తమ రాకెట్‌కు ‘విక్రమ్‌-ఎస్‌’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.