
చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాడు. సత్యదేవ్ కూడా ఇందులో ఓ అతిథి పాత్రను పోషించాడు. ఈ విషయాన్ని అతనే నిన్న రివీల్ చేశాడు. చిరంజీవికి వీరాభిమానినని, ఆయన్ని చూసే నటుడినయ్యానని చెప్పిన సత్యదేవ్.. ‘ఆచార్య’లో కాసేపు ఆయనతో కలిసి కనిపించే అదృష్టం తనకి దక్కిందంటూ సంతోషాన్ని వెలిబుచ్చాడు. అతని ట్వీట్‌కి చిరంజీవి రియాక్టయ్యారు. ‘నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం సంతోషం. ‘ఆచార్య’లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం ఆనందం. ‘గాడ్ ఫాదర్’లో నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నువ్వు నటించడం గర్వకారణం’ అంటూ ట్వీట్ చేశారు. మలయాళంలో మెప్పించిన ‘లూసిఫర్’ ఆధారంగా ‘గాడ్ ఫాదర్’ చిత్రం తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో వివేక్ ఒబెరాయ్ చేసిన విలన్ క్యారెక్టర్‌ను తెలుగులో సత్యదేవ్ పోషిస్తున్నాడు. ఆ విషయాన్ని ఇప్పుడిలా అధికారికంగా ప్రకటించారు చిరంజీవి. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నయనతారతో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.