సౌదీ మారుతోంది. ‘ విజన్ –2030 ’ దిశగా

సౌదీ మారుతోంది. ‘ విజన్ –2030 ’ దిశగా

సౌదీ అరేబియా మారుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టు అక్కడ కూడా మార్పులు తీసుకువస్తున్నారు. సౌదీ ఆడవారు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సొంతగా కార్లు డ్రైవ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఫుట్​బాల్ మ్యాచ్​లను, మ్యూజిక్ ప్రోగ్రామ్​లను చూడటానికి అనుమతిస్తున్నారు. ఒకప్పుడు ఇది ఊహించని విషయం. దేశంలో ఇవే కాకుండా మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. సౌదీల జీవితాలు మారడమే కాకుండా టూరిజం కూడా పెంచుకోవడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని సౌదీ అరేబియా ఆశపడుతోంది.

మొదట…. ఆడవాళ్లు డ్రైవ్ చేయడానికి లైసెన్స్ ఇచ్చారు. ఫుట్ బాల్ మ్యాచులు,చూడటానికి పర్మిషన్ ఇచ్చారు. అట్లాగే మ్యూజిక్ ప్రోగ్రాంలకు కూడా వెళ్లొచ్చని అనుమతులు ఇచ్చారు. తాజాగా సౌదీకి వచ్చే విదేశీ మహిళా టూరిస్టులు బుర్ఖా వేసుకోనక్కర్లేదని మినహాయింపు ఇచ్చారు (అయితే ఇది సౌదీ మహిళలకు వర్తించదు). సౌదీకి సంబంధించినంత వరకు ఇవన్నీ మామూలు నిర్ణయాలు ఏమీ కావు. సౌదీ అరేబియా మారుతోందనడానికి ఇవి రుజువులు అనుకోవాలి. ఇలా మినహాయింపులు ఇవ్వడానికి, ఇన్ని మార్పులు చేయడానికి సౌదీ పాలకులు చాలా వ్యతిరేకతనే ఎదుర్కొన్నారు. అయినా దేశంలో టూరిజం డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఈ మార్పులను తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఇలా టూరిస్టుల సంఖ్యను పెంచుకోవాలన్న నిర్ణయం వెనక సౌదీ అరేబియా పెద్ద ఆలోచనే ఉంది. కేవలం ఆయిల్ నిల్వల మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడి, వేరే రకంగా కూడా దేశానికి రాబడి పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు తీసుకువచ్చారు. ఈ మార్పుల్లో భాగంగానే ‘ విజన్ –2030 ’ డిక్లేర్ చేసింది.

పరుగులు తీస్తున్న ప్రపంచ ట్రెండ్ ను సౌదీ అరేబియా ఫాలో అవుతోంది. ఒకటని కాదు. అన్ని రంగాల్లో మార్పుకు వెల్ కం పలుకుతోంది. ఈ మార్పుల్లో భాగంగానే చమురు నుంచి టూరిజానికి మారుతోంది. ‘మిషన్ 2030 ’ డిక్లేర్ చేసింది. ఇంటర్నేషనల్ టూరిస్టు స్పాట్ గా దేశాన్ని తీర్చిదిద్దాలని  సౌదీ అరేబియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2030 నాటికి  టూరిజమే దేశానికి  ప్రధాన రాబడి వనరుగా మారేలా చర్యలు తీసుకుంటోంది. అప్పటికి ఏడాదికి పది కోట్ల మంది టూరిస్టులు దేశానికి వస్తారని లెక్కలు వేసుకుంది. ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకట్టుకోవడానికి తొలిసారి టూరిస్టు వీసాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. సౌదీ అరేబియా చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి వీసాలు ఇవ్వలేదు. టూరిస్టు వీసా కింద విదేశాల నుంచి వచ్చే వారెవరైనా మ్యాగ్జిమం 90 రోజుల పాటు సౌదీలో ఉండొచ్చు.  దీంతో  సౌదీ అరేబియా అందాలు చూడటానికి  విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి  సౌదీ అరేబియా కిందటేడాది నుంచే  గ్రౌండ్ వర్క్ మొదలెట్టింది. ఇక్కడి స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ ను చూడటానికి వచ్చే  విదేశీ టూరిస్టులకు టెంపరరీ వీసాలు ఇవ్వడం మొదలెట్టింది.

పెద్ద ఎత్తున ఉద్యోగాలు

మిషన్ 2030 అమల్లోకి వస్తే  టూరిజం రంగంలో  పది లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి. టూరిస్టుల కోసం కొత్తగా ఐదు లక్షల హోటల్ రూంలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే  టూరిజం అవసరాలకు తగ్గట్టు ప్రస్తుతం ఇన్ ఫ్రా స్ట్రక్చర్  లేదు. ఈ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలని  సౌదీ అరేబియా ప్రభుత్వం భావిస్తోంది. 2017 లోనే దీనికి సంబంధించిన పని మొదలెట్టింది. యాభై దీవులను లగ్జరీ రిసార్ట్స్ గా  మార్చే  మెగా ప్రాజెక్ట్ ను ప్రకటించింది. రాజధాని రియాద్ కు దగ్గర్లో  ‘క్విద్దియా’ పేరుతో  ఓ ఎంటర్ టైన్ మెంట్ సిటీని  నిర్మించే పని ప్రారంభించింది. ఇందులో పెద్ద ఎత్తున థీమ్ పార్కులు, మోటార్ స్పోర్ట్   సదుపాయాలు, ఓ సఫారీ పార్కు  ఉంటాయి. అంతేకాదు. దేశంలో  యునెస్కో గుర్తించిన ఐదు హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. వీటితో పాటు  దేశంలో అనేక చారిత్రక  ప్రదేశాలున్నాయి.  వీటన్నిటినీ  టూరిజానికి  అనుగుణంగా  డెవలప్ చేయాలని  సౌదీ ప్రభుత్వం భావిస్తోంది.

డ్రెస్ కోడ్ లోనూ మినహాయింపులు

సహజంగా ముస్లిం కంట్రీ అయిన సౌదీ అరేబియాలో మహిళల డ్రెస్ కోడ్ విషయంలో కఠినమైన రూల్స్ ఉంటాయి. విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి వీలుగా సౌదీ ప్రభుత్వం డ్రెస్ కోడ్ లోనూ మినహాయింపులిచ్చింది. విదేశాల నుంచి వచ్చే  లేడీ టూరిస్టుల విషయంలో ఇప్పటివరకు ఉన్న కొన్ని నిబంధనలను సౌదీ అరేబియా సడలించింది. ఏ డ్రెస్ వేసుకున్నా చూడటానికి  ‘డీసెంట్’ గా కనిపించాలని షరతు పెట్టింది.

మార్పు తప్పదంటున్న మిగతా దేశస్తులు

సౌదీ అరేబియా తీసుకువస్తున్న మార్పులకు మిగతా దేశాల్లోని ముస్లింలు వెల్​కం చెబుతున్నారు. “మార్పు అనేది తప్పదు. ఇవాళ కాకపోయినా రేపైనా మార్పులు రాక తప్పదు. వందల ఏళ్ల నుంచి వస్తున్న నిబంధనలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోక తప్పదు ” అని జకార్తాలోని ఓ మసీదు ఇమామ్ నసరుద్దీన్ ఉమర్ అన్నారు. “టూరిజాన్ని  డెవలప్ చేసుకోవడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎవరూ తప్పుపట్టరు. అయితే మత పరమైన విషయాల్లో మాత్రం  ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు” అని ఇండోనేషియాకు చెందిన ఓ ముస్లిం టీచర్ దిదీక్ సపుత్రా అన్నారు. సౌదీ అరేబియా అనుసరిస్తున్న విధానాలు చాలా ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. అయితే కొన్ని విషయాల్లో ప్రభుత్వం గట్టిగా ఉండాలన్నారు. టూరిజం పేరుతో పబ్ లు ఓపెన్ చేయడం, లిక్కర్ పార్టీలకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు సహించరన్నారు. ముస్లిం సమాజంలో సౌదీ అరేబియా పవిత్రతకు ఎలాంటి తేడా రాకుండా చూడాల్సిన బాధ్యత సౌదీ పాలకులపై ఉందన్నారు.

టూరిజం ఎకానమీ దిశగా

ఇప్పటివరకు చమురు బావుల నుంచి వచ్చే రాబడి మీదే సౌదీ అరేబియా ఆధారపడింది. సౌదీ అంటే ఆయిల్ అనే ముద్ర చాలా ఏళ్ల నుంచి ఉంది. ఆ దేశం పేరు చెబితే ఆయిల్ ఎకానమీయే గుర్తుకువస్తుంది. ఈ ముద్ర నుంచి దేశాన్ని బయటపడేయటానికి అక్కడి పాలకులు చర్యలు చేపట్టారు.  సౌదీ అరేబియాకు ఎంబీఎస్ కొత్త మార్గాన్ని నిర్దేశించాడు. ఇందులో భాగంగా అనేక రంగాల్లో కీలక మార్పులు చేశాడు. సౌదీ అరేబియాకు  మోడ్రన్ టచ్ ఇచ్చాడు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు దేశంలోనూ మార్పులు చేశాడు.

ఎవరీ మహమ్మద్ బిన్ సల్మాన్? 

సౌదీలో వస్తున్న ఈ మార్పులకు కారణం యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.  ఆయన ప్రిన్సే కాదు.  సౌదీ అరేబియాకు డిప్యూటీ  ప్రైమ్ మినిస్టర్ కూడా. ఎంబీఎస్ గా పాపులరైన ఆయన సౌదీ అరేబియా యువరాజు. ‘ లా ’ చదువుకున్నాడు. తండ్రి రాజు కాగానే, సల్మాన్ డిఫెన్స్‌‌ మినిస్టర్ అయ్యాడు. ఆ తరువాత 2017 జూన్ లో ఎంబీఎస్  యువరాజు అయ్యాడు. దీంతో సౌదీలో ఓ కొత్త శకానికి రూట్ క్లియర్ అయినట్లయింది.

 

 

మత పరంగా రాజీ పడేదే లేదు

టూరిజం అభివృద్దికి తీసుకుంటున్న చర్యలకు    సౌదీ అరేబియాలో కొంతమంది మద్దతు ఇవ్వడం లేదు. ఈ మార్పులు చివరకు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అనుమానాలను ‘సౌదీ అరేబియా కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్’  చైర్మన్ అహ్మద్ అల్ ఖతీబ్ తోసిపుచ్చారు. “ అవన్నీ  అర్థం లేని అనుమానాలు ” అన్నారు. మత పరమైన విషయాల్లో  రాజీ పడేది లేదన్నారు. మతానికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో  ప్రపంచం అంతటికీ తెలుసునన్నారు.