ఎప్పటికైనా వాళ్లంత గొప్పదాన్ని అవ్వాలన్నదే నా కల

ఎప్పటికైనా వాళ్లంత గొప్పదాన్ని అవ్వాలన్నదే నా కల

ఒక పుస్తకం రాయడం చాలా కష్టం. పుస్తకం రాయడం పూర్తై, పబ్లిష్‌‌ కావాలంటే చాలా సంవత్సరాలే పడుతుంది. అలాంటిది పదమూడేండ్లకే మూడు పుస్తకాలు రాసి, పబ్లిష్‌‌ చేసింది. అంతేకాదు, ఆమె రాసిన ప్రతీ పుస్తకం హిట్‌‌ అయింది. ఇప్పుడు ఇంకో పుస్తకం రాయడం పూర్తి చేసి ‘పబ్లిష్‌‌ చేయడానికి రెడీ’ అని తన ట్విట్టర్ అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేసింది. అంతేకాదు, అతి చిన్న వయసులో (ఫిమేల్‌‌ కేటగిరి) వరుసగా బుక్‌‌ సిరీస్‌‌లు పబ్లిష్‌‌ చేసినందుకు గిన్నిస్ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్‌‌ రికార్డ్స్‌‌లోకి ఎక్కింది. 

సౌదీ అరేబియాలోని ధహ్రాన్‌‌ సిటీలో ఉంటుంది రితాజ్‌‌ హుస్సేన్‌‌ అల్హజ్మి. వాళ్ల నాన్న ద్వారా అలవాటైన బుక్‌‌ రీడింగ్, ఏడేండ్ల వయసులో హాబీగా మారింది. దాంతో రోజూ దగ్గర్లో ఉన్న లైబ్రరీకి వెళ్లి  పుస్తకాలు చదివేది. అరబిక్‌‌, ఇంగ్లీష్‌‌ రాయడం, చదవడం వచ్చిన  అల్హజ్మి, తనకిష్టమైన అడ్వెంచరస్‌‌ పుస్తకాలు ఎక్కువగా చదివేది. ఆ నాలెడ్జే పుస్తకాలు రాయడానికి హెల్ప్‌‌ అయింది.  ఆమె రాసిన మొదటి పుస్తకం ‘ట్రెజర్ ఆఫ్​ ద లాస్ట్‌‌ సీ,’ రెండోది ‘పోర్టల్‌‌ ఆఫ్​ ద హిడెన్ వరల్డ్‌‌’. ఈ రెండూ 2019లో రిలీజ్‌‌ చేసింది. ‘బియాండ్‌‌ ద ఫ్యూచర్ వరల్డ్‌‌’ 2020లో వచ్చింది. ఇప్పుడు రిలీజ్‌‌ చేస్తున్న పుస్తకం పేరు ‘ద పాసెజ్‌‌ టు ద అన్‌‌నోన్‌‌.’ ఈ పుస్తకాలన్నీ  అడ్వెంచరస్‌‌వే. 

‘గిన్నిస్ బుక్ ఆఫ్​ వరల్డ్‌‌ రికార్డ్స్‌‌లోకి ఎక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి జె.కె. రౌలింగ్‌‌ (హ్యారిపోర్టర్‌‌‌‌ రైటర్‌‌‌‌), జోయాన్‌‌ రెండెల్‌‌ పుస్తకాలు చదువడం అలవాటు. వాళ్లే నాకు ఇన్‌‌స్పిరేషన్‌‌. ఎప్పటికైనా వాళ్లంత గొప్పదాన్ని అవ్వాలన్నదే నా కల’ అంటోంది అల్హజ్మి.