
- ఆప్ సర్కారును కూల్చేందుకు కుట్ర
- మా ఎమ్మెల్యేలను 5 కోట్లకు కొనేందుకు ప్రయత్నం
- బీజేపీపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపణలు
- ‘ఆపరేషన్ లోటస్’ను అడ్డుకున్నామని కామెంట్స్
న్యూఢిల్లీ/భావ్‌నగర్: తమ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకు కొనేందుకు, అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్.. ‘‘ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఆఫర్ చేశారు. కానీ మా ప్రభుత్వాన్ని కూల్చాలన్న బీజేపీ ప్రయత్నాలను మేం అడ్డుకున్నాం” అని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’కు సంబంధించిన ఆధారమంటూ ఓ వీడియోను ప్లే చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటర్లు ఇంకో పార్టీని ఎంచుకున్నారు. కానీ బీజేపీ ఆ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తున్నది. ఇందుకు ఆపరేషన్ లోటస్‌ను ప్లాన్ చేసింది. ఇలానే మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలో కూడా మనం చూశాం” అని అన్నారు. ‘‘బీజేపీలోకి రావాలని మనీశ్ సిసోడియాకు వాళ్లు ఆఫర్ ఇచ్చారు. సీఎంను చేస్తామని కూడా చెప్పారు. కేజ్రీవాల్ సర్కార్‌ను కూల్చేయాలని ప్రయత్నించారు’’ అని ఆరోపించారు. ఆఫర్ ఇచ్చిన బీజేపీ నేత ఎవరని మీడియా ప్రశ్నించగా.. ‘‘సరైన సమయంలోనే అన్ని విషయాలు బయటపడుతాయి. ఆధారాలను ఎప్పుడు, ఎలా రిలీజ్ చేయాలనే పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు” అని చెప్పుకొచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో చేరితే సీఎం పోస్ట్ ఇస్తామని, సీబీఐ, ఈడీ కేసులను మూసివేస్తామని చెప్పారని సిసోడియా సోమవారం ఆరోపణలు చేశారు. అయితే, లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని బీజేపీ కొట్టిపారేసింది.
గుజరాత్‌లో మహా వ్యాపమ్ స్కామ్: కేజ్రీవాల్
బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్‌లో మహా వ్యాపమ్ స్కామ్ జరిగిందని, కొన్నేండ్లుగా రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్లు లీక్ చేస్తూనే ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘పేపర్లు లీక్ చేసినందుకు ఎవరైనా జైలుకు వెళ్లారా? ఆప్ ప్రభుత్వం వచ్చాక వాళ్లను జైళ్లకు పంపుతాం. మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్ ఉంది. గుజరాత్‌లో మహా వ్యాపమ్ స్కామ్ జరుగుతున్నది” అని చెప్పారు. భావ్‌నగర్‌లో ఓ టౌన్ హాల్ మీటింగ్‌లో యువతను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. పేపర్ లీక్ చేసిన వాళ్లకు పదేండ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు సెక్టార్‌లో స్థానికులకు 80% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 15 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ‘‘గుజరాత్‌లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేస్తుంటే సీబీఐ రెయిడ్స్ చేయంచలేదు. ఎందుకంటే పేపర్లు లీక్ చేస్తున్నది వాళ్ల సొంత మనుషులే కాబట్టి” అని ఆరోపణలు చేశారు. మరోవైపు గుజరాత్‌లో ఆప్ ఉనికిని చూసి బీజేపీ భయపడుతోందని కేజ్రీవాల్ అన్నారు. త్వరలోనే గుజరాత్ బీజేపీ చీఫ్‌ను తొలగిస్తుందన్నారు.
ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్యకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ భార్య పూనమ్ జైన్‌కు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న సత్యేంద్ర జైన్‌తో పాటు అంకుష్, వైభవ్ జైన్ ఇదివరకే దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు ఈ నెల 27న విచారించనుంది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ నుంచి హవాలా మనీ ట్రాన్సాక్షన్లు జరిపారనే అభియోగాలతో సత్యేంద్ర జైన్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. 2015-–16 మధ్య హవాలా నెట్వర్క్ ద్వారా ఆయన కంపెనీకి దాదాపు రూ.5 కోట్ల దాకా డబ్బు ముట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మంత్రి సత్యేందర్ జైన్ సహా 10 మందిని నిందితులుగా పేర్కొంటూ ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ రిపోర్టు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.