స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన.. నడిగూడెం కోటను కాపాడండి

స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన..  నడిగూడెం కోటను కాపాడండి

మువ్వన్నెల జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య నివసించిన భవనం నేడు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. జాతీయ జెండా రూపకల్పనకు వేదిక అది. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిలూదిన కోట నడిగూడెం కోట.  ఈ కోటను 1875 లో నిర్మించారు.  స్వాతంత్ర్య కాంక్ష కలిగిన జమిందార్ రంగారావు కి మిత్రుడు పింగళి వెంకయ్య పరిచయంతో కోట కేంద్రంగా స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది. అక్కడే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది. జమిందార్ రాజా నాయిని రంగారావు, పింగళి వెంకయ్య  నడిగూడెం కోట నుంచే ఉద్యమానికి ఊపిరి ఊదారు. 

నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య  జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులతో తయారు చేసి మధ్యలో గాంధీకి ఇష్టమైన నూలువడికే  రాట్నం ఉంచారు. 1926లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది.  ఆ జెండాలో చిన్న మార్పులు చేసి రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు గాంధీ. అప్పటి జాతీయ ఉద్యమ నాయకులకు సైతం వెంకయ్య జెండానే ఆకర్షించింది. 

ఆ జెండాను పట్టుకునే ఉద్యమకారులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు.  చారిత్రక ఘటనకు వేదికైన ఆనాటి  ఈ రాజ భవనం నేడు పూర్తిగా శిథిలావస్ధకు చేరుకుంది. నాటి కళా నైపుణ్యం కళ్లకు కట్టేలా అద్భుతంగా తీర్చిదిద్దగా ఆ కట్టడంలో నాటి ఆనవాళ్లు చెరిగిపోతున్నాయి. రాజా వారసులు కోట ను ఓ రీసెర్చ్ సెంటర్ కు అద్దె కు ఇచ్చారు. వాళ్లు కోటలోకి ఎవరినీ అనుమతించక పోవడంతో పర్యాటకులు నిరాశతో వెనక్కి తిరుగుతున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భావి తరాలకు అందించాలి. నడిగూడెం కోటను ఒక టూరిస్టు కేంద్రంగా మార్చాలి. అత్యంత విశిష్టత కలిగిన ఈ కోటను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, సందర్శకులకు అందుబాటులో ఉంచాలి.

- శ్రీనివాస్ విప్లవ్ పల్లపు, జర్నలిస్ట్