హైదరాబాద్‌‌‌‌లో గృహజ్యోతితో కరెంట్‌‌‌‌ పొదుపు

హైదరాబాద్‌‌‌‌లో గృహజ్యోతితో కరెంట్‌‌‌‌ పొదుపు
  • 200 యూనిట్లు దాటకుండా వినియోగదారుల చర్యలు
  • తగ్గనున్న డొమెస్టిక్ డిమాండ్‌‌‌‌
  • కోటికి పైగా కనెక్షన్లకు స్కీం వర్తించే చాన్స్​
  • అమలు చేస్తే సర్కారుకు సబ్సిడీ భారం 3వేల కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గృహజ్యోతి స్కీం తో రాష్ట్రంలో కరెంటు పొదుపు పెరిగే చాన్స్ ఉందని విద్యుత్​రంగ ఎక్స్​పర్ట్స్​చెప్తున్నారు. సబ్సిడీ పొందడం కోసం గృహ వినియోగదారులు తమ కరెంటు వాడకాన్ని 200 యూనిట్లు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తున్నారు. కొంత మంది ఇప్పటి నుంచే తక్కవ కరెంటు వినియోగం దిశగా తమ అలవాట్లను మార్చుకుంటున్నారని చెప్తున్నారు.

గృహజ్యోతి కింద డొమెస్టిక్ కనెక్షన్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలలో వాడే కరెంటు 200 యూనిట్లలోపే వాడుకునేలా టార్గెట్ పెట్టుకుంటున్నారు. కరెంటు ఆదా, విద్యుత్‌‌‌‌ వినియోగంలో కొత్త పద్ధతులు అమలు చేస్తూ పొదుపు, తక్కువ వినియోగంతో పనులు చేసుకుంటున్నారు.

స్కీంలోకి కోటికి పైగా కనెక్షన్లు!

రాష్ట్రంలో డొమెస్టిక్‌‌‌‌ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు కోటి 20 లక్షలు ఉన్నాయి. ఇందులో నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడే కనెక్షన్లు కోటి 5లక్షలు(87.50శాతం) ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కోటికి పైగా ఉన్న కనెక్షన్లు ఏటా 9వేల మిలియన్‌‌‌‌ యూనిట్ల వరకు కరెంటు వాడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. సబ్సిడీ అమలుకు సర్కారు రెడీ అవడంతో 200 యూనిట్లకు పైగా వాడుతున్న వారు కూడా తమ కరెంటు వినియోగాన్ని తగ్గించుకునే పనిలో పడ్డారు. 

తక్కువ కరెంటు అవసరమయ్యే బల్బ్‌‌‌‌లు, ట్యూబ్‌‌‌‌లకు మారుతున్నారు. ఫ్యాన్‌‌‌‌లు, గీజర్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఇండక్షన్‌‌‌‌ స్టవ్‌‌‌‌, మైక్రోవేవ్‌‌‌‌, వాషింగ్‌‌‌‌ మెషీన్​ల వాడకాన్ని తగ్గించుకునే పనిలో పడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, టీవీలను ఆన్ చేసి వదిలేయకుండా.. అవసరమైతేనే వాడుకునేలా ఇప్పటి నుంచి అలవాట్లు మార్చుకుంటున్నారు. పొదుపు చర్యలు, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 40 శాతం విద్యుత్ ఆదా చేయొచ్చని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నరు. మనం వాడే విద్యుత్‌‌‌‌లో ఆదా చేసే ఒక యూనిట్ విలువ రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి సమానమని వారు చెప్తున్నారు.

‘సోలార్’ వినియోగంతో ఆదా

గృహజ్యోతి స్కీం అమలు చేస్తే పడనున్న సబ్సిడీ భారంపై విద్యుత్​అధికారులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్‌‌‌‌  కేటగిరీలో 0–50 యూనిట్లలోపు వినియోగానికి ఒక్కో యూనిట్‌‌‌‌కు రూ. 1.45, 51–100 యూనిట్లలోపు ఉంటే యూనిట్​కు రూ. 2.60, 101–200 యూనిట్లైతే యూనిట్​కు రూ. 4.30 చొప్పున ప్రస్తుతం కరెంటు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలతో పాటు మినిమమ్ చార్జీలు, ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ చార్జీలు, కస్టమర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. సర్కారు గృహజ్యోతి స్కీం అమలు చేస్తే దాదాపు రూ.3వేల నుంచి రూ.3500 కోట్ల వరకు సబ్సిడీ భారాన్ని భరించాల్సి ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు.

ప్రభుత్వ సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, వ్యవసాయ పంపుసెట్ లకు, గృహ వినియోగదారులకు సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ను వినియోగించుకునేలా ప్రోత్సహించడం ద్వారా విద్యుత్‌‌‌‌ను ఆదా చేసుకోవచ్చని ఎక్స్‌‌‌‌పర్ట్స్ చెబుతున్నారు. అలాగే కొన్ని సంస్థలు ఇష్టానుసారంగా కరెంటు వినియోగించకుండా స్లాబ్‌‌‌‌ విధించాలన్నారు. సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ను ఏర్పాటు చేయడం ద్వారా కరెంటు ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చని అంటున్నారు.