ఇంకా.. కుల వివక్ష ఉండటం బాధాకరం: మంత్రి సీతక్క

 ఇంకా.. కుల వివక్ష ఉండటం బాధాకరం: మంత్రి సీతక్క

మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా సావిత్రి బాయి పూలే జయంతిని ప్రకటించేలా మంత్రివర్గంలో చర్చించి, అమలు చేసేందుకు  కృషి చేస్తానన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క. జనవరి 3వ తేదీ బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 193వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..  మహిళలు చదుకునేందుకు సావిత్రి బాయి పూలే తొలి అడుగు  వేశారని.. తన లాంటి ఎంతో మందికి సావిత్రి బాయి పూలే ఆదర్శమని అన్నారు. కుల వివక్ష, అణిచివేత నుండి వచ్చిన వెలుగు రేఖ సావిత్రి బాయి పూలే అని.. ఆమె ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సమాజాన్ని సంస్కరించేందుకు చదువు, విజ్ఞానం కావాలని సావిత్రి బాయి పూలేను జ్యోతిరావు పూలే ప్రోత్సహించారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని.. నేటి సమాజంలో భర్తలు, వారి భార్యలను ప్రోత్సహించాలన్నారు. నేటి సమాజంలో ఇంకా కుల వివక్ష ఉండటం బాధాకరమన్నారు.

వాటిని నిర్ములించాలంటే ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పారు. తాను నిత్యా విద్యార్ధినని.. విప్లవ ఉద్యమం నుండి బయటకు వచ్చాక.. చదువు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని సావిత్రి బాయి పూలే స్పూర్తితో ఉన్నత చదువులు చదివానన్నారు. రాజకీయం అంటే తన దృష్టిలో సేవ మాత్రమేనని... అందులో ఉన్న తృప్తి ... అజమాయిషీ చేయడంలో ఉండదని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో ఆడవాళ్లు విద్యావంతులు కావాలని.. అప్పుడే సమాజం బాగుంటుందని మంత్రి సీతక్క చెప్పారు.