
- రిజల్యూషన్ ప్రక్రియపై ఎస్‌బీఐ
- వ్యతిరేకిస్తున్న చైనా లెండర్స్
- ఎలక్ట్రానిక్ ఓట్‌లో నిర్ణయం
న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్), దాని రెండు సబ్సిడరీల దివాలా ప్రక్రియను చేపట్టడానికి రిజల్యూషన్ నిపుణుడు ఒకరే ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రతిపాదిస్తోంది. అనిల్ అంబానీకి చెందిన ఈ టెలికాం కంపెనీ.. చైనీస్ లెండర్స్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం లెండర్స్‌తో జరిపిన భేటీలో ఎస్‌బీఐ ఈ ప్రతిపాదనను వారి ముందు ఉంచింది. ఒక్క రిజల్యూషన్ నిపుణుడు ఉంటే ఆర్‌కామ్, దాని సబ్సిడరీలు రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్ టెలికాం సంస్థల బ్యాంక్‌రప్ట్సీ ప్రొసీడింగ్స్ విషయంలో మంచి సహకారం ఉంటుందని ఎస్‌బీఐ చెబుతోంది. దీంతో రిజల్యూషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని, కంపెనీల విలువను పెంచవచ్చని అంటోంది. కానీ రెండు చైనీస్ బ్యాంక్‌లు మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నాయి. మూడు కంపెనీలకు ఒక్కరే రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఉంటే, వర్క్‌లోడ్ పెరుగుతుందని పేర్కొంటున్నాయి.
ఆర్‌కామ్, దాని సబ్సిడరీల ఇన్‌సాల్వెన్సీ ప్రొసెస్‌లను చేపట్టడానికి ప్రదీప్ సేథి, మిథాలీ షా, మనీష్ కనేరియా అనే ముగ్గురు తాత్కాలిక రుణ పరిష్కార నిపుణులను (ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్స్) నియమించేందుకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ గతేడాది మే నెలలో ఆమోదం తెలిపింది. ఈ ముగ్గురు ఆర్‌బీఎస్‌ఏ అడ్వయిజర్స్‌కు చెందినవారు. ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను మార్చుకుని కొత్త వ్యక్తిని నియమించుకునే స్వేచ్ఛ లెండర్స్‌కు ఉంది. ఎస్‌బీఐ ఆర్‌బీఎస్‌ఏ స్థానంలో డెలాయిట్‌ను నియమించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనను కూడా చైనీస్ లెండర్స్ వ్యతిరేకిస్తున్నారని దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఆర్‌కామ్‌కు, రిలయన్స్ టెలికాంకు చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ బ్యాంక్ ఆఫ్ చైనాలు కూడా అప్పులు ఇచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా డెలాయిట్‌ను నియమించే ప్రతిపాదపై లెండర్స్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇండియన్ బ్యాంక్‌లు డెలాయింట్ అపాయింట్‌మెంట్‌కే మొగ్గుచూపుతున్నాయి.