ఎస్బీఐ లాభం రూ.19,160 కోట్లు

ఎస్బీఐ లాభం రూ.19,160 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్​బీఐ నికరలాభం (స్టాండెలోన్​) ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్లో 12 శాతం పెరిగి రూ.19,160 కోట్లుగా రికార్డయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ రూ.17,035 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.1,35,342 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది రూ.1,22,688 కోట్లని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. 

బ్యాంక్  వడ్డీ రూ.1,17,996 కోట్లకు మెరుగుపడింది. ఇది గత జూన్ క్వార్టర్లో రూ.1,11,526 కోట్లు ఉంది. నిర్వహణ లాభం కూడా రూ.26,449 కోట్ల నుంచి రూ.30,544 కోట్లకు పెరిగింది. జూన్ క్వార్టర్ చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌‌‌‌పీఏలు) 2.21 శాతం నుంచి 1.83 శాతానికి తగ్గాయి.   నికర ఎన్‌‌‌‌పీఏలు 0.47 శాతం తగ్గాయి. కేటాయింపులు ఈ క్వార్టర్లో రూ.4,759 కోట్లకు పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.3,449 కోట్లుగా ఉన్నాయి. 

బ్యాంక్  మూలధన సమృద్ధి నిష్పత్తి 14.63 శాతానికి మెరుగుపడింది. ఇది గత జూన్ క్వార్టర్లో 13.86 శాతం ఉంది. కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన, ఎస్​బీఐ గ్రూప్ నికర లాభం గత సంవత్సరం రూ.19,681 కోట్ల నుంచి రూ.21,627 కోట్లకు పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా రూ.1,52,125 కోట్ల నుంచి రూ.1,66,992 కోట్లకు మెరుగుపడిందని ఎస్​బీఐ తెలిపింది.