ఎస్సీ, ఎస్టీ రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ వెంకటయ్య

దుబ్బాక, వెలుగు: ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ భూముల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రైతులే కబ్జాలో ఉన్నారని వారి పేరుతో పట్టా పాస్​ బుక్​లు లేవనిఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్​ బక్కి వెంకటయ్య తెలిపారు. ఇలాంటి రైతుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం దౌల్తాబాద్​ రైతువేదికలో కలెక్టర్​ మను చౌదరి అధ్యక్షతన భూభారతి అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్​ భూముల్లో కబ్జాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు పట్టా పాస్​బుక్​లు లేకపోవడంతో రైతు భరోసా రావడం లేదని, బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదని, దీంతో పేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. 

ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులకు అధికారులు ఓపికతో సమాధానం చెప్పాలని సూచించారు. భూభారతి చట్టంపై గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతులు భూభారతితో సులువుగా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తుందని చెప్పారు. 

కలెక్టర్​ మాట్లాడుతూ ప్రభుత్వ, ఎండోమెంట్​, ఇతరత్రా భూములను కబ్జా చేసిన వారికి నోటీసులు ఇచ్చి ఫీల్డ్​ వెరిఫై చేసి కబ్జాదారుల చెర నుంచి విడిపిస్తామని తెలిపారు. సర్వే నంబర్​లోని భూ యజమానులను పిలిచి అందరి ఆమోదంతోనే రీ సర్వే నంబర్​ ఇస్తామని చెప్పారు. అడిషనల్​ కలెక్టర్​ అబ్దుల్​ హమీద్, ఆర్డీవో సదానందం, పీఏసీఎస్​ చైర్మన్​ వెంకట్ రెడ్డి, స్పెషల్​ ఆఫీసర్​ లింగమూర్తి పాల్గొన్నారు.

భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  అన్ని గ్రామాల ప్రజలు, రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్  ఎం. మను చౌదరి సూచించారు. బుదవారం మండలంలోని గొల్లపల్లిలో అడిషనల్​ కలెక్టర్  అబ్దుల్ హమీద్ తో  కలిసి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ భూభారతి చట్టంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆర్డీవో చంద్రకళ, పీఏసీఎస్  చైర్మన్  ఇంద్రసేనారెడ్డి, ఏఏంసీ చైర్మన్  వి.నరేందర్ రెడ్డి, మండల స్పెషల్  ఆఫీసర్  వినయ్ కుమార్, తహసీల్దార్  నిర్మల పాల్గొన్నారు.