ఆశారాం బాపూ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆశారాం బాపూ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) కొట్టేసింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనికోసం ఉత్తరా ఖండ్‌ వెళ్లి  ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆశారాం బాపూ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించింది. ఆయనకు జైలులోనే ఆయుర్వేద చికిత్సను అందించాలని జైలు అధికారులకు సూచించింది.

ఆశారాం బాపూ గతంలో కూడా పలుసార్లు ఆరోగ్యం నిలకడగా లేదని బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు కోరారు. అయితే, దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక డాక్టర్లను నియమించింది. ఆశారాం బాపూను పరీక్షించిన డాక్టర్లు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు.

ఆశారాం బాపూ 2013 తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్‌ బాలికను అత్యాచారం చేశారు. ఈ ఘటన రుజువు కావడంతో ఆయనకు జోధ్‌పూర్‌ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు జోధ్‌పూర్‌ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.