రాజద్రోహంపై పిటిషన్లు.. రాజ్యాంగ ధర్మాసనానికి

రాజద్రోహంపై పిటిషన్లు..  రాజ్యాంగ ధర్మాసనానికి
  • సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు
  • కనీసం ఐదుగురు జడ్జిల బెంచ్ విచారణ జరుపుతుందని వెల్లడి

న్యూఢిల్లీ: ఐపీసీలోని 124ఏ సెక్షన్‌‌ (రాజద్రోహం) రాజ్యాంగ బద్ధతను సవాల్‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. కనీసం ఐదుగురు జడ్జిల కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్ ఈ కేసులను విచారిస్తుందని తెలిపింది. సీజేఐ జస్టిస్‌‌ డీవై చంద్రచూడ్‌‌, జస్టిస్‌‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌‌ మనోజ్‌‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండియన్ పీనల్ కోడ్‌‌లోని నిబంధనల్లో మార్పులు చేర్పులు చేపడుతున్నందున.. లార్జర్‌‌‌‌ బెంచ్‌‌కు సిఫార్సు చేయడాన్ని వాయిదా వేయాలంటూ కేంద్రం చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఒకటి కంటే ఎక్కువ కారణాలతో పిటిషన్లు దాఖలయ్యాయని, లార్జర్ బెంచ్ పరిశీలనను వాయిదా వేయాలనే అభ్యర్థనను అంగీకరించడానికి తాము సిద్ధంగా లేమని చెప్పింది. ‘‘కొత్త బిల్లు చట్టంలా మారి అమల్లోకి వచ్చినప్పటికీ.. లా పుస్తకాల్లో రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్ 124ఏ అమల్లో ఉన్నంత కాలం.. ఆ సెక్షన్‌‌ కింద విచారణ కొనసాగే అవకాశం ఉంది.

ఆ కోణంలో 124ఏ సెక్షన్‌‌పై అసెస్‌‌మెంట్ జరగాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొంది. సంబంధిత డాక్యుమెంట్లను సీజేఐ ఎదుట ఉంచాలని, తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆగస్టు 11న ఐపీసీ, సీఆర్‌‌పీసీ, ఎవిడెన్స్‌‌ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను ప్రతిపాదిస్తూ మూడు బిల్లులను లోక్‌‌సభలో కేంద్ర మంత్రి అమిత్‌‌ షా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాజద్రోహ సెక్షన్‌‌ను పూర్తిగా రద్దు చేస్తూ బిల్లులో ప్రతిపాదనలు చేశారు.