రాజ్యాంగబద్ధ పదవులు..నజరానాలు కాకూడదు! : కూరపాటి  వెంకట్ నారాయణ

రాజ్యాంగబద్ధ పదవులు..నజరానాలు కాకూడదు! : కూరపాటి  వెంకట్ నారాయణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు, చట్టాలకు, సామాజిక న్యాయానికి కట్టుబడి పరిపాలన చేయాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్​ ముఖ్యమంత్రిగా మంత్రివర్గ ఏర్పాటుతో పాటు, అనేక రాజ్యాంగ సంస్థల పదవుల నియామకంలో రాజ్యాంగ నిబద్ధతకు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అనేక వివాదాస్పద నిర్ణయాలు, నియామకాలు చేశారని ప్రజలు, పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా నిత్యం గగ్గోలు పెడుతూనే ఉన్నారు. గత తొమ్మిది ఏళ్ల నుంచి పాలనలో వర్గ వివక్ష దృక్పథాన్నీ ఆయన అణువణువునా నింపుకున్నారనేది సామాజిక విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్ర జనాభాలో 80 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో మొండి చేయి చూపించారు. తన సామాజిక వర్గానికి మాత్రం అన్ని వ్యవస్థల్లో అతి పెద్ద పీటలు వేసి గౌరవిస్తున్నారు. ప్రజలకు పుట్నాలు, పాలకులకు కట్నాలు అన్నట్లుగా పరిపాలన నడుస్తున్నది. టీఎస్​పీఎస్సీ దుర్మార్గపు సంఘటనల వల్ల గత నాలుగైదు నెలల నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదుర్కొంటున్న అశాంతిని అంచనా వేయలేం. ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలు, గ్రామాల్లోని బడులు నాణ్యమైన విద్య అందించలేని దుస్థితికి చేరుకున్నాయి. డిగ్రీ, పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరడానికి ఇష్టపడటం లేదు.

వీసీల నియామకాల్లో..

కుటుంబం నుంచి నాయకులు, అధికారుల వరకు ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు అగ్రకులాలు అధికారాన్ని చలాయించినప్పటికీ ఇంత దుర్మార్గంగా కుల దురభిమానం చూపించిన దాఖలాలు పెద్దగా లేవు. స్వరాష్ట్రంలో కుల దురభిమానంతో ముఖ్యంగా పోలీసు, నీటిపారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్ మండలి, టీఎస్పీఎస్సీ, యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి.. తన సామాజిక వర్గానికి సంబంధించిన బంధువులను, అస్మదీయులను అనేకమందిని నియమించుకొని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పంచి పెడుతున్నారు. విద్యుత్ శాఖలో ఈఆర్సీ చైర్మన్ ఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లను, నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్, సీఎంవోలో ప్రిన్సిపల్ సెక్రెటరీ, పోలీస్ శాఖలో ఇంటెలిజెన్స్ అధికారులు, ఆర్టీసీలో సెక్యూరిటీ ఓఎస్డీ, తెలంగాణ టూరిజం చైర్మన్, సెస్​ డైరెక్టర్,  తెలుగు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్స్, టీఎస్పీఎస్సీ మెంబర్, టీటీడీ బోర్డు మెంబర్, వరంగల్ జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు అనేక మంత్రులకు ఓఎస్ డీలుగా నియమించుకోవడం చూస్తున్నాం. దాన్ని తెలంగాణ ఉద్యమకారులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు, విద్యావంతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఇతర కులాల్లో కరువైనట్లు 75 ఏళ్లకు మించిన వయసు గల తన సామాజిక వర్గం వారిని ఈ నామినేటెడ్ పదవుల్లో నియమించడమేగాక నిరంతరం కొనసాగించడం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైందో రుజువు చేస్తున్నది. టీఎస్​పీఎస్సీ సభ్యులు, చైర్మన్ ల నియామకాల్లో పారదర్శకత లేదని, అర్హతలు, సమర్థత, సభ్యుల ప్రత్యేకతలను  పరిశీలించకుండానే నియమించినట్లు న్యాయ విచారణ సందర్భంగా అనేక లోపాలను ఉన్నత న్యాయస్థానం ఎత్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అనేక ఇతర రాజ్యాంగ  పదవుల గురించి కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత తొమ్మిది ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్న విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా అంతే. తొమ్మిదేండ్లలో మూడేండ్లపాటు వర్సిటీలకు వీసీలు లేరు. 2021లో జరిగిన వీసీల నియామకాల్లో కూడా నియమ నిబంధనలు గాలికి వదిలేశారు. ప్రస్తుతం అనేకమంది వీసీల నియామకంపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. 

పాలకులు గుర్తెరగాలి..

ఉన్నత స్థాయి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్, పరిశోధక విజ్ఞానం, పరిపాలన అనుభవం, నిజాయితీ గమనించకుండానే వీసీలను నియమిస్తే జరిగేది అనర్థమే. యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కి వీసీల నియామకంలో అవినీతికి పాల్పడితే, డబ్బు ఇచ్చి పదవులు పొందిన విసీల నిర్వాకం ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో అధికారాన్ని చలాయిస్తున్న ఓ వ్యక్తి వర్సిటీల వీసీల నియామకంలో  గంటె తిప్పడం వల్లే ప్రస్తుతం యూనివర్సిటీలు భ్రష్టు పడుతున్నాయని విద్యార్థి, అధ్యాపక, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర పోషించడం వల్ల ప్రభుత్వ సంస్థలు మరింత దిగజారుతాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని అనేకమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ టీఎస్పీఎస్సీ, విశ్వవిద్యాలయాలు, ఇతర రాజ్యాంగ సంస్థలు ఇంత దారుణంగా నిర్లక్ష్యానికి గురి కావడం ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వంలో నిర్లక్ష్యం, నిరాసక్తత, బంధుప్రీతి, అవినీతి, ఆశ్రితపక్షపాతం అణువణువునా తిష్ట వేయడం వల్లే రాష్ట్రానికి ఇంత దుర్గతి పట్టిందని విశ్లేషకుల అభిప్రాయం. కొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ఈ వ్యవస్థల దురవస్థను ఎండగడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారాలని ప్రజలు కోరుకుంటారు. 2024లో కొలువుదీరే ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల ప్రజల చేదు అనుభవాలను గుర్తుంచుకొని రాజ్యాంగ సంస్థల నియామకాలను నియమ నిబంధనలకు లోబడి చేయకపోతే ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి, సమాజాభివృద్ధికి రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా దూరమవుతారు. ప్రభుత్వ అధినేతల అడుగులకు మడుగులొత్తే, పొర్లు దండాలు పెట్టే, జీ హుజూర్ అనే అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కోసం ఇలాంటి నియామకాలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రాజెక్టులు కూలిపోవచ్చు. కానీ టీఎస్పీఎస్సీ, విశ్వవిద్యాలయాల నియామకాల్లో అవినీతి జరిగితే మొత్తం వ్యవస్థలే కుప్పకూలే ప్రమాదం ఉందని పాలకులు, ప్రజలు గుర్తెరగాలి.

ALSO READ:కేసీఆర్‌‌‌‌కు ఎన్నికలకు ముందే స్కీమ్స్‌‌ గుర్తొస్తయ్: పొంగులేటి

టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యులు నియామకం

టీఎస్పీఎస్సీ ఒక రాజ్యాంగ సంస్థ, గెజిటెడ్ ఆఫీసర్లను సైతం ఎంపిక చేసి నియమించే అధికారం గల టీఎస్పీఎస్సీ సభ్యులకు ఔన్నత్యం, నిజాయతీ, నిబద్ధత, ఉన్నత స్థాయి అధికారిగా అనుభవం, సామర్థ్యాలు కలిగి ఉండాలని రాజ్యాంగ చట్టాలు నిర్దే శిస్తున్నాయి. నిజాం కాలంలో జాగీర్లకు, వందిమాగదులకు అనుయాయులకు, అస్మదీయులకు ‘జీ హుజూర్’, చెంచాగిరి చేసేవారికి నవాబులు నజరానాలు ఇచ్చేవారు.  అలాగే తెలంగాణ ప్రభుత్వం పదవులు కూడా అస్మదీయులకు పంపిణీ చేసిందని స్పష్టమవుతున్నది. ఏమాత్రం నిబంధనలు పట్టించుకోకుండా అత్యున్నత పదవుల నియామకాలు చేస్తున్నట్లు గత తొమ్మిది సంవత్సరాల చేదు అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ నియామకాల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, టీఎస్​పీఎస్సీ, విశ్వవిద్యాలయాల నిర్వహణ పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల రాజ్యాంగ పదవులను ఆత్మీయులకు, వందిమాగదులకు  అనుయాయులకు సంతర్పణ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులకు, సమర్థత లేని వారికి టీఎస్​పీఎస్సీలో, విశ్వవిద్యాలయాల్లో బాధ్యతలు ఇస్తే భావి ప్రభుత్వాలు అవినీతి, అన్యాయం, దోపిడీకి నిలయాలు అవుతాయని ముఖ్యమంత్రికి తెలియనిది కాదు. గ్రూప్ వన్ సర్వీసులో ఎంపికైన అభ్యర్థులు చాలా మంది ఆల్ ఇండియా సర్వీసెస్ స్థాయికి ఎదుగుతారు. కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్స్, ఇంజనీర్ ఇన్ చీఫ్, చీఫ్ సెక్రటరీ అత్యున్నత స్థాయి పదవులు పొందుతారు. అలాంటి ఉన్నత స్థాయి సమర్థత గల అధికారులను ఎంపిక చేసే కమిషన్ సభ్యులుగా స్కూలు టీచర్లు, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులు, సీఎంవోలో పనిచేస్తున్న అధికారి బావ , ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులను, ప్రైవేటు క్లినిక్ లలో పనిచేసే డాక్టర్లను నియమించడం ద్వారా ఎన్ని లక్షల మంది విద్యార్థులకు, ఎన్ని తరాల ప్రజలకు అన్యాయం జరుగుతుందో అంచనా వేయగలమా? అక్కడక్కడ బెరుకుల లాంటి అవినీతి అధికారులు ప్రభుత్వంలో ఆసీనులైతేనే ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి.

- కూరపాటి  వెంకట్ నారాయణ,  రిటైర్డ్​ ప్రొఫెసర్​, కేయూ