సర్కార్‌‌‌‌పై ఎస్సీ, ఎస్టీ డాక్టర్ల అసంతృప్తి

సర్కార్‌‌‌‌పై ఎస్సీ, ఎస్టీ డాక్టర్ల అసంతృప్తి

ఏండ్ల తరబడి పెద్ద పోస్టుల్లో రెడ్లకే చాన్స్
సర్కార్‌‌‌‌పై ఎస్సీ, ఎస్టీ డాక్టర్ల అసంతృప్తి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆరోగ్యశాఖలో ప్రమోషన్లు, పోస్టింగుల విషయంలో సీనియారిటీని పట్టించుకోవట్లేదని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్‌‌ అసోసియేషన్ ఆరోపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా తమను అవమానిస్తున్నారని అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌ డాక్టర్‌‌‌‌ బాబురావు గురువారం హైదరాబాద్​లోని ఐఎమ్​ఏ హాల్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్లు, పోస్టింగ్​లలో న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పి ఏడాది కావొస్తున్నా.. అమలుకు మాత్రం నోచుకోవట్లేదన్నారు. సీఎం ఆఫీసులో ఉన్న రాజశేఖర్‌‌‌‌రెడ్డి అనే ఆఫీసర్ సీఎం కేసీఆర్‌‌‌‌కు తప్పుడు సమాచారం ఇచ్చి, ఆరోగ్యశాఖను రెడ్ల రాజ్యంగా మార్చేశాడని డాక్టర్ బొంగు రమేశ్‌‌ ఆరోపించారు. డీఎంఈ రమేశ్‌‌రెడ్డి ఐదేండ్ల నుంచి ఆ పోస్టులో కొనసాగుతున్నారని, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీగా చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి అనే మరో ఆఫీసర్ కొనసాగుతున్నారని, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా కరుణాకర్‌‌‌‌రెడ్డి ఏడేండ్లుగా ఉన్నారని.. ఇలా ముఖ్యమైన అన్ని పోస్టుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినోళ్లనే నియమిస్తున్నారని గుర్తు చేశారు. వాళ్లందరినీ తప్పించి సీనియర్లు ఎవరుంటే వారికి హెచ్‌‌వోడీ పోస్టులు ఇప్పించాలని సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.

ఝాన్సీకి అన్యాయం
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఝాన్సీని అన్యాయంగా రంగారెడ్డి డీసీహెచ్‌‌ఎస్ పోస్టు నుంచి తప్పించారని డాక్టర్లు ఆరోపించారు. షాద్‌‌నగర్‌‌‌‌ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌గా ఉన్న ఝాన్సీని, ఆ పోస్టు నుంచి తప్పించి ఆమె కంటే జూనియర్‌‌‌‌ (సివిల్ అసిస్టెంట్ సర్జన్‌‌) అయిన శ్రీనివాసులును సూపరింటెండెంట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత ఝాన్సీని డీసీహెచ్‌‌ఎస్‌‌గా నియమించారని, ఇప్పుడు ఆ పోస్టు నుంచీ తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. కారణం లేకుండా ఆమెను తొలగించడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, హైకోర్టు తీర్పునూ ప్రభుత్వం గౌరవించట్లేదన్నారు. షాద్‌‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​తో కలిసి శ్రీనివాసులు.. మంత్రి హరీశ్‌‌రావుతో భేటీ అయ్యారని, ఝాన్సీపై చర్యలకు ఉసిగొల్పారని ఆరోపించారు. మంత్రి ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని, ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డాక్టర్లు రవికుమార్, పద్మజ, ఝాన్సీ, సుధాకర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.