రెండేళ్లయినా డబ్బులు రాక డిపాజిటర్ల ఆందోళన

రెండేళ్లయినా డబ్బులు రాక డిపాజిటర్ల ఆందోళన
  • తాళ్లరాంపూర్ సొసైటీలో రూ.కోట్లలో స్కామ్​
  • బాధ్యుల ఆస్తుల విక్రయంపై మౌనం..

నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం రేపిన తాళ్లరాంపూర్ సొసైటీ స్కామ్ ఎంక్వైరీ ముగిసి ఏడాదిన్నర అవుతోంది. అయినా డిపాజిట్ దారులకు సొమ్ము చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ సొసైటీలో జరిగిన అవినీతిపై బాధితులు, నిజామాబాద్ఎంపీ అర్వింద్ 2021 మేలో ఫిర్యాదు చేస్తే 75 రోజుల అనంతరం విచారించారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సొసైటీ లో చైర్మన్ తోపాటు సీఈవోను బాధ్యులుగా చేస్తూ చర్యలు చేపట్టాలని రూ.3.70 కోట్లు రికవరీ చేయాలని సహకారశాఖ సర్కార్ కు సిఫార్సు చేసింది . దోషుల నుంచి అవినీతి సొమ్మను రికవరీ చేసేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టినా  కోర్టుకు వెళ్లారు‌. దీంతో అక్రమార్కుల ఆస్తుల వేలం జరుగలేదు. సొసైటీ ఆస్తులు వేలం‌వేసి విక్రయించారు.  ఆర్నెళ్లు దాటినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. ఇప్పటికీ సభ్యులపై చర్యల్లేవు.  దీంతో రాష్ట్ర మంత్రి కాపాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ లో చైర్మన్ సామ గంగారెడ్డి బీఆర్ఎస్ నేతనే కాకుండా మంత్రి వేములకు అనుచరుడు. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ సొసైటీ రూ.11.5 కోట్లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. వీటిలో అప్పులు ఏడు కోట్లు, డిపాజిట్​దారుల సొమ్ము రూ.నాలుగున్నర కోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారీ స్కామ్ జరిగిందని రైతులు ఫిర్యాదు చేశారు. సొసైటీకి రూ.ఏడుకోట్ల మేర స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని డిపాజిటర్ల సొమ్ముతో సమకూర్చుకున్నారు. లాభాల్లో రూ.రెండున్నర కోట్లు డిపాజిట్​దారులకు చెల్లించారు. ఇంకా చెల్లించాల్సిన రూ.4.50 కోట్లతోపాటు అప్పులు రూ.ఏడుకోట్లు కలిపితే  రూ.11.5 కోట్లు అవుతుంది. కేవలం మూడన్నర కోట్లు అవినీతి జరిగిందని విచారణలో తేలింది. ఇవి పోను రూ.8  కోట్ల లెక్కలు అంతుచిక్కడం లేదు. ఈ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

స్కాములో ఆ ఇద్దరిదే ప్రధాన పాత్ర..

తాళ్ల రాంపూర్‌‌ సొసైటీ లో భారీ స్కామే జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్‌‌ సంఘ రికార్డులు పరిశీలించి, సంఘ ఖాతాలను ఆడిట్‌‌చేసి ఆఫీసర్లను, బ్యాంక్‌‌ ఆఫీసర్లను విచారించి గత సోమవారం డిస్ట్రిక్ట్‌‌ కోఆపరేటివ్‌ ‌ఆఫీసర్‌‌కి నివేదిక సమర్పించారు. దీనిలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అక్రమ దారిలో సొసైటీ మాజీ చైర్మన్‌ ‌సోమ చిన్న గంగారెడ్డి, మాజీ సెక్రటరీ స్వామి సొసైటీకి కోట్లాదిగా నష్టం చేశారు. నిధుల దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్‌‌కి సొసైటీ సభ్యులు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు కలెక్టర్‌‌ ఆదేశించారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్‌‌ ప్రకారం 2012 నుంచి 2020 వరకు విచారణ జరిగింది.

ఇదీ జరిగిన అక్రమాల తీరు..

మాజీ చైర్మన్‌‌, సెక్రటరీలు సొసైటీ లో ఆర్‌‌బీఐ నాబార్డ్‌‌ రూల్స్‌‌ పాటించకుండా సభ్యులు కాని వారి నుంచి కూడా డిపాజిట్లు స్వీకరించారు. డిపాజిట్ల పై రూల్స్‌‌కి విరుద్దంగా అధిక వడ్డీ చెల్లించి సొసైటీ పూర్తిగా నష్టపోవడానికి కారణమయ్యారు. సొసైటీ రైస్‌‌మిల్‌‌లో రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్‌‌చేసేందుకు 2014 లో జిల్లా పౌర సరఫరాల శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. క్వింటా వడ్లకు 67 కిలోల బియ్యం తీసి సివిల్‌ ‌సప్లయ్స్‌‌కి అందించాల్సి ఉంటుంది. అయితే దిగుబడి రాలేదనే కారణం చూపి గత ఏడేళ్లుగా సుమారు రూ.89 లక్షల విలువైన బియ్యం కొనుగోలు చేసి సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కి పంపినట్లు రికార్డుల్లో చూపారు. మాజీ సెక్రటరీ జిల్లా సహకార బ్యాంక్‌‌ నుంచి పొందే జీతానికి అదనంగా సొసైటీ నుంచి రూల్స్‌‌కి విరుద్దంగా రూ.7 లక్షల 4వేల రిస్క్‌ ‌అలవెన్స్‌‌ని తీసుకున్నారు.

అక్రమాలను చేర్చకుండా ఆడిటింగ్...

సొసైటీ చేపట్టిన రైస్‌‌మిల్‌‌, ఫంక్షన్‌‌హాల్‌‌, బిల్డింగ్‌‌, కవర్‌‌షెడ్‌‌, గోడౌన్ల నిర్మాణాలకు అంచనాలు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. సొసైటీలో అంచనాలకు మించి ఖర్చు చేశారు. 2012 నుంచి 2020 వరకు సొసైటీ ఖాతాలను 5 మంది ఆడిటర్లు ఆడిట్‌‌చేశారు. అయితే వీరెవరు ఈ అక్రమాల తంతుపై నివేదిక లో చేర్చకుండా, వాటికి అడ్డు చెప్పకుండా  అంతా క్లీన్‌‌గా ఉన్నట్లు ఆడిట్‌‌ చేసి వెళ్లిపోయారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ ‌నుంచి గోడౌన్లు, ఆఫీసులు, గోల్డ్‌‌ తదితరాలపై సొసైటీకి లోన్స్‌‌ మంజూరు ‌చేశారు. మంజూరు టైంలో గోల్డ్‌‌ నిల్వలు, ధాన్యం నిల్వలు పరిశీలించకుండా లోన్లు మంజూరు చేయడం గమనార్హం.

అక్రమాలపై చర్యలు...

సొసైటీ లో జరిగిన అక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలను విచారణ అధికారి సిఫారసు చేశారు. మాజీ చైర్మన్‌‌, మాజీ సెక్రటరీ నుంచి రూ.3.32 కోట్ల రికవరీ చేయాలని వారిపై క్రిమినల్‌‌చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడిటింగ్‌‌లో ఉదాసీనంగా వ్యవహరించిన ప్రతి ఆడిటర్‌‌ను వ్యక్తిగతంగా విచారించి  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సొసైటీ మహాజన సభ ఏర్పాటు చేసి నివేదికను సభ్యుల ముందుంచి ఆస్తుల అమ్మకంపై చర్చించి డిపాజిటర్లకు చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సొసైటీ మాజీ చైర్మన్ అవకతవకలకు పాల్పడినా మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రధాన అనుచరుడనే రికవరీతో సరిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

మా డబ్బులు ఇప్పించండి..

ఆటో నడిపి పైసా పైసా కూడబెట్టి సొసైటీలో జమ చేసినం. సొసైటీ అవకతవకలతో అవసరాలకు మా డబ్బులు అందకుండా పోయాయి. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఎంక్వైరీ పూర్తయి ఏడాదిన్నరైనా  బాధితులకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించ లేదు. ఆఫీసర్లు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలె. మా డబ్బులు మాకు ఇప్పించాలె.

- శ్రీరాముల శంకర్, తాళ్లరాంపూర్

పైసలు ఎప్పుడిస్తరు..?

సొసైటీ లో డిపాజిట్ చేసిన పైసలు ఇంకా ఇస్తలేరు‌. డిపాజిట్ టైమ్ ముగిసినా సొసైటీ లో డబ్బుల్లేవు. ఆస్తులు అమ్మి ఇస్తమన్నరు. కానీ డిపాజిట్ పైసలు లేట్ చేస్తున్రు. మా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులు ఇప్పుడైన డిపాజిట్​ డబ్బులు ఇవ్వాలి.

- లత, గుమ్మిర్యాల్​