బషీర్బాగ్, వెలుగు: మహిళ పేరుతో చాటింగ్ చేసి.. ఓ వ్యక్తితో గోల్డ్ ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయించిన స్కామర్లు అతని వద్ద రూ.24.44 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 47 ఏండ్ల వ్యక్తికి గతేడాది డిసెంబర్ 13న ఓ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. శరణ్య అనే మహిళ పేరుతో స్కామర్స్ చాటింగ్ చేశారు. కొన్ని రోజుల్లో వారు స్నేహితులుగా మారారు. స్కామర్స్ బాధితుడితో ప్లే స్టోర్ నుంచి కేడీఈవన్గోల్డ్అనే ట్రేడింగ్ యాప్ ను ఇన్స్టాల్ చేయించారు. అందులో ఇన్వెస్ట్ చేస్తే 70 శాతం వరకు అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.
బాధితుడు మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. వచ్చిన లాభాలను విత్ డ్రా చేసుకోవడంతో అతనికి నమ్మకం కలిగింది. దీంతో పలు దఫాలుగా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. యాప్లో రూ.39 లక్షల బ్యాలెన్స్ చూపించారు. వాటిని విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా ట్యాక్స్, కన్వర్షన్ చార్జెస్ పేరిట అదనంగా డబ్బులు చెల్లించాలని స్కామర్స్ డిమాండ్ చేశారు. ఈ విషయమై స్కామర్స్ చాట్ చేసిన నంబర్ ను సంప్రదించగా.. వారు అతని కాంటాక్ట్ ను బ్లాక్ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మొత్తం రూ. 24,44,152 పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.

