ఐ అండ్​ పీఆర్​లో భారీగా అక్రమాలు

ఐ అండ్​ పీఆర్​లో  భారీగా అక్రమాలు
  •  పదేండ్లలో ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం
  • తేల్చేందుకు సిద్ధమైన కొత్త ప్రభుత్వం
  • డిపార్ట్​మెంట్​లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు
  • బీఆర్​ఎస్​ అనుకూల మీడియాకు ప్రజాధనం ధారాదత్తం
  • సమయం, సందర్భం లేకుండా ఇబ్బడిముబ్బడిగా యాడ్స్​
  • పేరుకే సర్కార్​ ప్రకటనలు.. కానీ, అంతా ‘గులాబీ’ ప్రచారమే!
  • ఇన్​స్టాలో రీల్స్​ చేసేవాళ్లకు కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు
  • గత ఏప్రిల్​ నుంచి డిసెంబర్​ వరకు రూ. 350 కోట్ల ఖర్చు
  • అన్ని వివరాలను తెప్పించుకున్న సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ (ఐ అండ్​ పీఆర్​)లో గత పదేండ్లలో జరిగిన వ్యవహారాలు, అక్రమాలను తేల్చేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించింది. డిపార్ట్​మెంట్​లోని ఒకరిద్దరు అధికారులు, బీఆర్​ఎస్​లోని కొందరు నేతలు చేతులు కలిపి ప్రజాధనాన్ని దారిమళ్లించినట్లు ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. న్యూస్​ పేపర్లు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కోసం ఐ అండ్​ పీఆర్​ డిపార్ట్​మెంట్​ చేసిన ఖర్చులపై సీఎం రేవంత్​ రెడ్డి వివరాలు తెప్పించుకున్నారు.

 ఈ ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్​ వరకు వివిధ రూపాల్లో ప్రకటనలకు దాదాపు 350 కోట్ల రూపాయలను డిపార్ట్​మెంట్​ ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలిసింది. ఇందులో దశాబ్ది ఉత్సవాల కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వేడుకలకు దాదాపు వంద డాక్యుమెంటరీలు చేయించారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​లోని ఓ ఎమ్మెల్సీ, అప్పటి సీఎంవోలో పనిచేసిన ఓ బయటి వ్యక్తికి సంబంధించిన సంస్థలు రూపొందించిన వీడియోలనే అప్రూవ్​ చేసి.. వాళ్లకే ఎక్కువ నిధులు వెళ్లేలా ప్లాన్​ జరిగినట్లు బయటపడింది. 

30% నిధులు బీఆర్​ఎస్​ మీడియా సంస్థలకే!

2014 నుంచి ఏ మీడియాకు ఎన్ని ప్రకటనలు వెళ్లాయి ? వాటికి చెల్లించిన మొత్తం ఎంత ?  ఏ రకంగా యాడ్స్​ను ఇచ్చారనే దానిపై పూర్తి రిపోర్ట్​ను రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నది. ఇందులో గత అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థలకే పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు గుర్తించింది. సమయం, సందర్భం లేకుండా ఆ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించడమే కాకుండా.. మార్కెట్​లో అవే ప్రధాన మీడియా సంస్థలు అనే విధంగా ఎక్కువ మొత్తంలో రేటు కార్డు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేసినట్లు బయటపడింది. మొత్తం నిధుల్లో 30 శాతం వరకు ఆ మీడియా సంస్థలకే చేరినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 

ఇన్​స్టాలో రీల్స్ చేసేవాళ్లకు కూడా..!

ఇన్​స్టాలో రీల్స్​ చేసేవాళ్లకు, యూట్యూబర్లకు, ఫేస్​బుక్​పేజీలను మెయింటేన్​ చేసేవాళ్లకు కూడా పెద్దమొత్తంలో ఐ అండ్​ పీఆర్​ డిపార్ట్​మెంట్​ నుంచి నిధులు వెళ్లినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో డిజిటల్ మీడియా కార్పొరేషన్ లేదు. అయితే.. డిపార్ట్​మెంట్​లోని ఓ ఆఫీసర్​ నాడు ఐటీ శాఖతో ఎమ్​ఓయూ చేసుకుని దాదాపు 10 కోట్ల రూపాయలు బీఆర్​ఎస్​ అనుకూల ఇన్​స్టా, ఫేస్​బుక్​ ఇన్​ఫ్లూయెన్సర్ల​కు యాడ్స్​ రూపంలో ధారబోసినట్లు తెలిసింది.

తిష్టవేసి నడిపించిన్రు

ఐ అండ్​ పీఆర్​ డిపార్ట్​మెంట్​లో తిష్టవేసిన ఓ రిటైర్డ్​ ఆఫీసర్​ గత రెండేండ్ల నుంచి భారీగా అక్రమాలకు తెరలేపినట్లు గుర్తించిన ప్రభుత్వం ఇటీవలే ఆయనను విధుల నుంచి తొలగించింది. సదరు రిటైర్డ్​ ఆఫీసర్​ కాలంలో చేసిన పేపర్​ ప్రకటనలు, టీవీ యాడ్స్​, ఔట్ డోర్, డిజిటల్​ మీడియాకు చేసిన చెల్లింపులన్నింటిపై ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఆ రిటైర్డ్​ అధికారితోపాటు ఓ సీనియర్​ ఐఏఎస్ అధికారి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. 

పదేండ్లలో ముఖ్యంగా గత రెండేండ్లలో బీఆర్ఎస్​కు మద్దతుగా నిలిచిన మీడియా చానళ్లు, పేపర్లు, డిజిటల్​ మీడియా ప్లాట్​ఫామ్​లకు ఇబ్బడిముబ్బడిగా ప్రకటనలు గుప్పించి, నిధులు దారిమళ్లించినట్లు ప్రస్తుత ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. ఓ మాజీ మంత్రి, ఓ రాజ్యసభ మెంబర్​ ఆదేశాలతో ఐ అండ్​ పీఆర్​ డిపార్ట్​మెంట్​లోని ఒకరిద్దరు అధికారులు ఈ కథనంతా నడిపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

పేరుకు సర్కార్​ యాడ్స్​​.. ప్రచారమేమో పార్టీకి!

రెండు పర్యాయాల కేసీఆర్ పాలనలో భారీగా అడ్వర్టయిజ్​మెంట్లు గుమ్మరించారు. టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చిన తర్వాత ఇవి మరింత పెరిగిపోయాయి. దేశానికే తెలంగాణ టార్చ్​ బేరర్​, రోల్​ మోడల్​ అంటూ అన్ని రాష్ట్రాల్లోని పేపర్లకు, టీవీ చానళ్లకు, డిజిటల్ మీడియాకు హిందీ, ఇంగ్లిష్​, ప్రాంతీయ భాషల్లో ఇబ్బడిముబ్బడిగా యాడ్స్​ ఇచ్చారు. పేరుకు తెలంగాణ ప్రభుత్వ యాడ్స్​ కానీ.. వాటి వెనుక బీఆర్​ఎస్​ పార్టీకి ప్రచారం చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని పత్రికలకు ఒక్కో యాడ్  కోసం రూ.4 కోట్ల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తున్నది. 

బీఆర్​ఎస్​లోని కీలక నేతలు ఏ ఆదేశాలు ఇస్తే అవే ఐ అండ్​ పీఆర్​ డిపార్ట్​మెంట్​లో అమలయ్యేవని డిపార్ట్​మెంట్​లోని కొందరు సిబ్బంది చెప్తున్నారు. ఐదారేండ్లలోనే కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగం జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. ఒక పేపర్ కు కోటి రూపాయల యాడ్ అని ఆర్వో రిలీజ్ అయితే.. యాజమాన్యానికి మాత్రం 40 లక్షలే చేరేదని, మిగితాదంతా కొందరి జేబుల్లోకి వెళ్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా చాలా రాష్ట్రాల పేపర్స్ కు, టీవీలకు యాడ్స్​ రూపంలో రిలీజ్ అయిన సొమ్ములో అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది.