
- సాధారణం కంటే తగ్గిన వర్షపాతం
- మెట్ట పంటలపై ఎఫెక్ట్
గద్వాల, వెలుగు: ఒకవైపు కృష్ణ, మరో వైపు తుంగభద్ర నదులు పొంగిపొర్లుతుంటే, నడిగడ్డ రైతులు మాత్రం వానల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు నెలల నుంచి సరైన వానలు లేక రైతులు తిప్పలు పడుతున్నారు. జూన్ నెలలో 2, 3, 21, 22 తేదీల్లో తప్ప ఇప్పటివరకు పెద్ద వానలు కురవలేదు. వర్షాలు లేక మెట్ట పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మిరప, ఆముదాలు, కంది, పొగాకు, వేరుశనగ పంటలు ప్రస్తుతం ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. భారీ వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలపై కూడా ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు.
రెండు నెలలుగా లోటు వర్షపాతమే..
జూన్, జులై నెలల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ లో 84.4 మిల్లీమీటర్ల వర్షం కురువాల్సి ఉండగా, 72.4 మిల్లీమీటర్లు కురవగా, 14.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులైలో 112.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 96.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ నెలలో 13.6 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల ప్రారంభమైనప్పటికీ వానల జాడ కనిపించడం లేదు. శుక్రవారం ఏకంగా ఎండాకాలాన్ని తలపించేలా ఎండ దంచి కొట్టింది.
మెట్ట పంటలపై ఎఫెక్ట్..
జోగులాంబ గద్వాల జిల్లాలో 1,73,211 ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేశారు. ఇందులో పత్తి, ఆముదం, కంది, మొక్కజొన్న, మిరప, వేరుశనగ ఉన్నాయి. రోజుల తరబడి వానలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మెట్ట పంటలకు ఇప్పటికే ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. ప్రతిరోజు కారు మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో చిరుజల్లులు పడుతున్నాయే తప్ప పెద్ద వానలు కురవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వానలు పడకపోతే తీవ్ర నష్టం తప్పదని అంటున్నారు.
వనపర్తిలో నిండని చెరువులు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో వర్షాలు ఓ మోస్తరుగా పడుతున్నా చెరువులు పూర్తి స్థాయిలో నిండడంలేదు. జిల్లాలో 1,179 చెరువులు ఉండగా, 506 చెరువులు 25 శాతం పూర్తిగా నిండాయి. 48 చెరువులు మాత్రమే అలుగు పారుతున్నాయి. జిల్లాలో రెండు నెలల్లో 217.7 మిల్లీ మీటర్లకు గాను, 235.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయినప్పటికీ భారీ వర్షాలు కురవకపోవడంతో చెరువులు నిండలేదని అంటున్నారు. బోర్లు, కాల్వల కింద పొలాలు ఉన్న రైతులు వరి నాట్లు వేసుకున్నారు. వనపర్తి జిల్లా సాగు విస్తీర్ణం 2,82,665 ఎకరాలు కాగా, జిల్లాలో ఖరీఫ్ సాగు నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు 24.7 శాతం పంటలే సాగయ్యాయి.
కాల్వలు, బోరుబావులే దిక్కు
ఈ ఏడాది ముందస్తు వర్షాలు వచ్చినా, భారీ వర్షాలు లేకపోవడంతో చెరువులు నిండలేదు. జూన్, జులై నెలల్లో18 రోజులే వర్షాలు కురిశాయి. ఖరీఫ్‌లో చెరువుల కింద భారీగా పంటలు సాగు చేస్తారు. సాధారణ వర్షపాతం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ చెరువుల్లో నీరు చేరలేదు. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా, జిల్లాలో మాత్రం పెద్దగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ నుంచి డి8 కెనాల్‌కు సాగునీరు విడుదల చేయడంతో రేవల్లి, గోపాల్పేట మండలాల్లోని చెరువులు నిండాయి. దీంతో ఈ రెండు మండలాల్లో రైతులు వరి నారుమడులు వేసుకోవడం ప్రారంభించారు. రేవల్లి మండలంలో మాత్రమే 74 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 506 చెరువులు 25 శాతం వరకు, 358 చెరువులు 50 శాతం వరకు, 162 చెరువులు 75 వరకు, 105 చెరువులు వంద శాతం నిండాయి.