పథకాలు పారట్లేదు .. గ్రామాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగలు

పథకాలు పారట్లేదు .. గ్రామాల్లో ఎమ్మెల్యేలకు నిరసన సెగలు
  • దళిత, బీసీ బంధు, గృహలక్ష్మి స్కీంలపై ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రశ్నిస్తున్న జనాలు
  • అనుచరులు, అధికార పార్టీ లీడర్లు, అనర్హులకే ఇస్తున్నారని ఆగ్రహం
  • గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేశ్​, పైళ్ల శేఖర్​రెడ్డిలకు తప్పని పరాభవం

హనుమకొండ/వర్ధన్నపేట/ మొగుళ్లపల్లి/ యాదాద్రి/ ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పథకాలు కొందరికే ఇస్తున్నారని, అందులోనూ అనర్హులే ఉంటున్నారని, బీఆర్ఎస్​కార్యకర్తలు, లీడర్లను ఎంపిక చేస్తున్నారని గురువారం పలు గ్రామాల్లో పర్యటనలకు వచ్చిన ఎమ్మెల్యేలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గృహలక్ష్మి, దళితబంధు, బీసీ బంధు సాయం ఇవ్వకపోవడంపై ఎక్కడికక్కడ నిలదీశారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్లపల్లి మండలంలోని సుమారు 16 గ్రామాల్లో పర్యటించగా ఎనిమిది గ్రామాల్లో అడ్డుకున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలానికి వచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​కు సైతం నిరసన సెగ తప్పలేదు. సంక్షేమ పథకాలన్నీ ఆయన అనుచరులకే ఇస్తున్నారని, అర్హులైన వృద్ధులకు కూడా పింఛన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. యాదాద్రి జిల్లా
భువనగిరి మండలంలో అందరికీ దళితబంధు, బీసీ బంధు ఎప్పుడొస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని కారు దిగనీయలేదు. ఖమ్మం జిల్లా బూడిదేంపాడులో వార్డు మెంబర్ కుటుంబంలో ఐదుగురికి దళితబంధు యూనిట్లు మంజూరు చేశారని దళిత కుటుంబాలు ఇల్లందు మెయిన్​రోడ్డుపై రాస్తారోకో చేశాయి.  

ఎమ్మెల్యే గండ్రను 8 గ్రామాల్లో అడ్డుకున్నరు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అభివృద్ధి పనులను ప్రారంభించారు. 16 గ్రామాల్లో పర్యటిస్తే నర్సింగాపూర్, మెట్టుపల్లి, ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్లు,పెద్ద కోమటిపల్లి, కొరికిశాల, గణేశ్​పల్లిల్లో ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. ‘పథకాలు ఎప్పటికీ ఉన్నోళ్లకే ఇస్తారా? లేనోళ్లకు రావా? బీఆర్ఎస్ ​కార్యకర్తలకు, లీడర్లకు ఇచ్చుడేంది? వచ్చినోళ్లకే మళ్లీ మళ్లీ ఇస్తున్నరు. మేము అర్హులము కాదా? లేకపోతే ఓటర్లం కాదా?’అని ప్రశ్నించడంతో స్థానిక లీడర్లు జోక్యం చేసుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొన్ని గ్రామాల్లో ప్రశ్నిస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. భూపాలపల్లి డీఎస్పీ రాములు, చిట్యాల సీఐ వేణుచందర్ నేతృత్వంలో మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల ఎస్సైలు.. పోలీసులను భారీగా మోహరించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ మండలంలోని ఏ గ్రామంలో తనకు మెజారిటీ ఓట్లు వస్తాయో ఆ గ్రామానికి రూ.10 లక్షల స్పెషల్​గ్రాంట్​ఇస్తానని ప్రకటించారు.

ఎమ్మెల్యే అనుచరులకే అన్ని పథకాలా?

‘అర్హులైన వృద్ధులకు పింఛన్లు వస్తలేవు. సంక్షేమ పథకాలన్నీ ఎమ్మెల్యే అనుచరులకే ఇస్తున్నరు’ అంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ను ఐనవోలు మండల ప్రజలు నిలదీశారు. కొండపర్తి, వనమాల కనపర్తి, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు తదితర 15 గ్రామాల్లో  గురువారం ఎమ్మెల్యే పర్యటించి  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొండపర్తిలో బీఆర్ఎస్ కళాకారుల బృందం పార్టీ చేపట్టిన పనులను వివరిస్తూ..నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత అరూరి రమేశ్ దే అని ఆటపాటలతో ప్రచారం చేస్తుండడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే రమేశ్​ అక్కడకు చేరుకోగా గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు.  ‘ఎన్నికలు వస్తేనే ఊర్లు గుర్తొస్తయా..ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మా ఊరికి  ఏం చేశారు? సమస్యలు పరిష్కరించకుండా ఓట్ల కోసం వస్తారా?’ అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు నిరసనకారులను కంట్రోల్ చేసి ఎమ్మెల్యే పర్యటనకు అడ్డు తొలగించారు. అక్కడి నుంచి వనమాల కనపర్తి గ్రామానికి చేరుకోగా.. అక్కడి జనాలు రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు.  గ్రామంలో సమస్యలను ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వనమాల కనపర్తిలో తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చేస్తున్నదేమీ లేదని పద్మశాలీలు నిరసనకు దిగారు. అక్కడి యువకులంతా ‘అరూరి రమేశ్ డౌన్ డౌన్.. ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను నిలదీస్తుండడంతో ఐనవోలు ఎస్సై నవీన్, పోలీసులు గ్రామానికి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని పర్యటన ముగిసిన తర్వాత విడిచిపెట్టారు. కక్కిరాలపల్లిలో ప్రభుత్వ పథకాలు అందరికీ అందడం లేదని, బీఆర్ఎస్​ వాళ్లకే ఇస్తున్నారని కాంగ్రెస్​, బీజేపీ లీడర్లు ఆందోళన చేశారు. గ్రామస్తుల నిరసనల నేపథ్యంలో పోలీసుల ప్రొటెక్షన్ మధ్య ఎమ్మెల్యే రమేశ్ పర్యటన కొనసాగించారు.  

అనర్హులకు దళిత బంధు ఇచ్చారంటూ...

ఖమ్మం జిల్లా బూడిదేంపాడు వార్డు మెంబర్ కుటుం బంలో ఐదుగురికి దళితబంధు ఇచ్చారంటూ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ఆ గ్రామ దళిత కుటుంబాలు ఇల్లందు మెయిన్​రోడ్డుపై రాస్తోరోకో నిర్వహించారు. లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. గ్రామంలో 250 దళిత కుటుంబాలుండగా అందుకు తగ్గట్టుగా ఎంపిక చేయలేదన్నారు. సర్పంచ్​ప్రమేయం లేకుండా సెక్రెటరీ, వార్డు మెంబర్లు, అధికార పార్టీ లీడర్లు కలిసి 39 మంది పేర్లను లిస్టులో చేర్చారన్నారు. ఫైనల్ చేసిన లిస్ట్ ను రద్దు చేసి, రీ వెరిఫికేషన్​ఆధారంగా అర్హులైన దళిత కుటుంబాలకు ఇవ్వాలన్నారు. ఎస్సై కొండలరావు ఆందోళనకారులకు సర్ది చెప్పడంతో రాస్తోరోకో విరమించారు. సర్పంచ్ మీరాసాహెబ్ మాట్లాడుతూ తనకు తెలియకుండానే లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేశారన్నారు.  రాస్తారోకో చేసి రాకపోకలకు అంతరాయం కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని అంతోటి ఆనందరావు, గుడిబండ్ల శ్రీకాంత్, తాళ్లపల్లి శ్రీకాంత్, చప్పిడి బాలశౌరి, తాళ్లపల్లి వెంకటరత్నం, కౌశిల రవిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

దళిత, బీసీ బంధు అందరికీ ఎప్పుడస్తదంటూ..

దళితబంధు, బీసీ బంధు ఎప్పుడిస్తారని భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే శేఖర్​రెడ్డిని గురువారం జనాలు నిలదీశారు. పలు పనుల శంకుస్థాపనలు, బతుకమ్మ చీరల పంపిణీ కోసం మండలంలోని కూనూరు, వడపర్తి, తాజ్​పూర్​, బీఎన్​తిమ్మాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆయనను కారు దిగనీయలేదు. దళిత బంధు, బీసీ బంధులో ఊరుకు ఇద్దరు ముగ్గురికి ఇస్తే.. తమందరికీ ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. వచ్చిన ఇద్దరు ముగ్గురిలో కూడా అర్హులైన వారికి కాకుండా అనర్హులకు, బీఆర్​ఎస్​కార్యకర్తలకే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి వారికి సమాధానమిస్తూ విడతల వారీగా అందరికీ పంపిణీ చేస్తామని సర్ది చెప్పి వెళ్లిపోయారు.