- త్రిమెన్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు
- హెచ్ఎం, టీచర్లకు తెలిసినా బయటకు రానీయలే
- యాకూబ్ పాషా అరెస్ట్, రిమాండ్
- హెచ్ఎం కమల సస్పెన్షన్, మిగతా టీచర్లకు మెమోలు
కరీంనగర్/గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ స్కూల్‌లో బాలికలపై అటెండర్ లైంగిక వేధింపుల ఘటనపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. యాకూబ్‌పాషా ఏడాది కాలంగా బాలికలను వేధిస్తున్నట్లు నిర్ధారణ అయింది. తొలుత యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ.. పోలీసుల విచారణలో లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో అతడిపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అటెండర్ అకృత్యాలను కప్పిపుచ్చిన హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు వేశారు. బాలికలపై జరుగుతున్న దాడి గురించి తెలిసినా ఉన్నతాధికారులకు చెప్పకుండా నిర్లక్ష్యం చేసిన 10 మంది టీచర్లకు ఇప్పటికే మెమోలు జారీ చేయగా.. ఒకటి, రెండు రోజుల్లో వారందరినీ ఇతర స్కూళ్లకు ట్రాన్స్‌ఫర్ చేయనున్నట్లు తెలిసింది.
ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్..
హనుమకొండ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన యాకూబ్‌పాషా కారుణ్య నియామకం కింద మూడేండ్ల కింద గంగాధర మండలంలోని ఓ స్కూల్‌లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరాడు. స్కూల్ డే ఫంక్షన్స్, ఇతర కార్యక్రమాల్లో విద్యార్థినులతో ఫొటోలు దిగే యాకూబ్ పాషా.. తర్వాత వాటిని మార్ఫింగ్ చేశానని స్టూడెంట్లను బెదిరించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24న సఖి కౌన్సెలింగ్ సెంటర్ నిర్వాహకుల ద్వారా అటెండర్ యాకూబ్ పాషా వేధింపుల సమాచారం కలెక్టర్ పమేలా సత్పతికి చేరింది. సున్నితమైన అంశం కావడంతో సీపీ గౌష్ ఆలంతో చర్చించిన కలెక్టర్.. డీడబ్ల్యూఓ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, గంగాధర ఎంఈవోతో త్రిమెన్ కమిటీని నియమించారు. వీరి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలపై ఏడాది కాలంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు తేలడంతో హెచ్‌ఎం కమల గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత నెలలోనే హెచ్‌ఎంకు తెలిసినా...
యాకుబ్‌పాషా వ్యవహారంపై కొందరు విద్యార్థినులు సెప్టెంబర్‌లోనే హెచ్‌ఎం కమలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కానీ ఆమె చర్యలు తీసుకోకుండా యాకూబ్‌పాషానే వెనుకేసుకొచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా... సిబ్బందిని పిలిచి ఈ విషయం బయటకు చెప్పొద్దని, ఎవరైనా బయటకు చెబితే స్కూల్‌లోనే ఉరి వేసుకొని చస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో సిబ్బంది భయపడి వెనక్కి తగ్గారని పలువురు అభిప్రాయపడుతున్నారు. యాకూబ్‌పాషా చేసే దారుణాలకు ఇద్దరు సిబ్బంది కూడా సహకరించినట్లు తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ విచారణతో యాకుబ్ పాషా అరాచకాలు బయటపడ్డాయి.
కలెక్టర్, సీపీ సీరియస్
గంగధార ఘటనను కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడు యాకూబ్ పాషా సస్పెన్షన్ చేయడం కాకుండా మొత్తం సర్వీస్ నుంచే డిస్మిస్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అన్ని పాఠశాలల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఈవోను ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆధారాలు సేకరించాక పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 21 కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. ఇలాంటి నేరాలు జరిగితే పోలీసులకుగానీ, ఉన్నతాధికారులకుగానీ సమాచారమివ్వాలని, తెలిసి సమాచారం ఇవ్వకపోయినా చట్టపరంగా శిక్షకు గురవుతారని హెచ్చరించారు. బాలికల ఐడెంటిటీని బయటపెట్టిన వారిపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు.
నిందితులందరిపై పోక్సో కేసు నమోదు చేయాలి : కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ జిల్లాలోని ఓ స్కూల్‌లో అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో హెచ్ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. వారి పాత్ర ఉన్నట్లు తేలితే పోక్సో కేసు నమోదు చేసేందుకూ వెనుకాడొద్దని కలెక్టర్, కమిషనర్‌కు సూచించినట్లు చెప్పారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనలో పిల్లలకు భరోసా ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన పడకుండా ధైర్యం కల్పించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అటెండర్ యాకూబ్ పాషాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. అలాగే యాకూబ్‌పాషా అనుచిత ప్రవర్తనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఖండించారు. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సీపీని ఆదేశించారు.
