కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు

కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు
  •    స్టీరింగ్​ లాక్​ కావడంతోనే ప్రమాదం
  •     మొరం గడ్డకు తట్టుకుని ఆగడంతో తప్పిన ముప్పు  
  •     45 మంది చిన్నారులు సురక్షితం 

శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్యనాయక్​తండాలో స్టూడెంట్స్​తో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు మొరం గడ్డకు తట్టుకుని ఆగడంతో పెను ముప్పు తప్పింది. ప్రగతిసింగారం గ్రామానికి చెందిన సన్​రైజ్​ పబ్లిక్​స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు ఉదయాన్నే పలు గ్రామాల్లోకి  వెళ్లి సుమారు 45 మంది స్టూడెంట్స్​ను తీసుకుని బయలుదేరింది. 

సూర్యనాయక్​తండా సమీపంలో మూలమలుపు వద్దకు  రాగానే బస్సు స్టీరింగ్ ​లాక్​కావడంతో పక్కనే ఉన్న కాల్వ​లోకి దూసుకెళ్లింది. కాల్వకు మరోవైపు ఎత్తుగా మొరం గడ్డ ఉండడంతో బస్సు ఒకపక్కకు ఒరిగి ఆగింది. గమనించిన స్థానికులు స్టూడెంట్స్​ను నెమ్మదిగా బస్సులోంచి కిందికి దింపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాల్వకు ఐదు మీటర్ల దూరంలోనే ఓ వ్యవసాయ బావి ఉంది. 

బస్సు స్పీడ్​గా ఉన్నా, కాల్వకు అవతలి వైపు మొరం గడ్డ లేకున్నా నేరుగా బావిలోకి దూసుకువెళ్లేది. విషయం తెలుసుకున్న పేరెంట్స్​ ప్రమాదం జరిగిన చోటికి వచ్చి తమ పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లిపోయారు.