కోడిపిల్ల బతకాలని ఆరాటపడ్డాడు : బ్రేవరీ అవార్డ్ గెల్చుకున్నాడు

కోడిపిల్ల బతకాలని ఆరాటపడ్డాడు : బ్రేవరీ అవార్డ్ గెల్చుకున్నాడు

ఆ క్యూట్ కిడ్ కు ఇంకా ఆరేళ్లు కూడా నిండలేదు.

కానీ ఆ బుడతడు ప్రపంచానికి ఓ మెసేజ్ ఇచ్చాడు.

సాటి మనిషి బాధలో ఉన్నా పట్టింపు లేని ఈ సమాజంలో… ఓ చిన్న పక్షి ప్రాణం కాపాడేందుకు తపించాడు ఆ చిన్నోడు.

ఓ చేతిలో గాయపడిన కోడిపిల్ల… మరో చేతిలో పది రూపాయల నోటు పట్టుకున్న ఆ పసివాడి కళ్లలో జాలి, అమాయకత్వం చూసి సోషల్ మీడియా ప్రపంచం మనసు చివుక్కుమంది. అప్పటికే ప్రాణం వదిలిన ఆ పక్షిపై ఆ బుడ్డోడు చూపించిన మమకారం.. చేసిన తప్పుకు కుమిలిపోతూ అతడి మొహంలో ఆందోళన, అమాయకత్వం చూసి వెబ్ వరల్డ్ అయ్యోపాపం అనుకుంది. ఒహ్హో చిన్నోడా.. ఎంత మంచి మనసు నీది… అని ముద్దుచేసింది.

ఈ బాలుడి పేరు డెరెక్ సి లాల్ చన్హిమా. ఉండేది మిజోరంలో. ఆడుకుంటుండగా.. కోడిపిల్లపైనుంచి సైకిల్ పోనివ్వడంతో.. అది గాయపడింది. అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే దాన్ని తీసుకుని దగ్గర్లోని ఓ హాస్పిటల్ కు వెళ్లాడు. జేబులో ఉన్న పాకెట్ మనీ పది రూపాయల నోటు తీసి ఇస్తూ.. ఈ కోడిపిల్లను ఎలాగైనా బతికించండి అంటూ అక్కడున్న నర్స్ ను వేడుకున్నాడు. అది అప్పటికే చనిపోయిందని తెలిసిన నర్స్.. డెరిక్ ప్రాధేయపడటాన్ని చూసి ఫొటో తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ ఫొటో వెనుక కథ తెల్సుకున్న ఇంటర్నెట్ సమాజం డెరిక్ మంచి మనసుకి హ్యాట్సాఫ్ చెప్పింది. పక్షులు, జంతువులపై డెరిక్ చూపిస్తున్న కన్సర్న్ ను చూసి… ఇపుడు తమను తామే ప్రశ్నించుకుంటోంది.

మనిషిగా ఓ పక్షిపై మానవత్వం చూపించిన గొప్ప క్యారెక్టర్ డెరిక్ ది. అందుకే.. స్కూల్ యాజమాన్యం డెరిక్ ను ప్రత్యేకంగా గౌరవించింది. “ఓ కోడిపిల్ల కోసం డెరిక్ పడిన తపన.. ఎంతోమందికి కనువిప్పు కలిగించేదే. దానిని కాపాడేందుకు అతడు పడిన శ్రమ.. గుర్తించతగినదే. బాలుడి ఔదార్యం, దయాగుణం, మంచితనం… తమ మనసులు  కరిగించాయి అంటూ… ఆ బాలుడికి బ్రేవరీ అవార్డ్ అందించి.. ప్రత్యేక గుర్తింపుతో సత్కరించింది.