లింగంపేట, వెలుగు: మధ్యాహ్న భోజనం తిని 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోజులాగే మంగళవారం మధ్యాహ్న భోజనం పెట్టారు.
అన్నం తిన్న కొద్ది సేపటికే ఐదో తరగతికి చెందిన దుర్గాప్రసాద్, హరి ప్రీత్, సాయితేజ, ఆదర్శప్రేమ్, ప్రవీణ్, రోహిత్, హేమంత్, నాలుగో తరగతికి చెందిన శశివర్ధన్ అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పిగా ఉందని స్కూల్ హెచ్ఎం లక్ష్మీ తులసికి చెప్పడంతో వెంటనే 108 వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి హాస్పిటల్కు చేరుకుని అస్వస్థతకు గురైన పిల్లలను పరామర్శించారు. ఘటనకు కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోచంపాడ్ ఘటనపై హెచ్ఆర్సీలో కేసు..
పద్మారావునగర్: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ లోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని సాయి లిఖిత(14) చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణకు స్వీకరించినట్లు సమాచారం.
డిసెంబర్ 5న పాఠశాలలో భోజనం చేసిన అనంతరం సాయి లిఖిత అస్వస్థతకు గురైంది. ముందుగా స్థానిక దవాఖానకు తరలించి.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని హాస్పిటల్కు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇదే ఘటనలో పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.
