21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు

21కిలోల లడ్డూను చోరీ చేసిన స్కూల్ విద్యార్థులు

హైదరాబాద్ : చార్మినార్ లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరీకి గురైంది. దాదాపు 21 కిలోల లడ్డూను స్కూలు పిల్లలు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఘాన్సీబజార్ గణేష్‌ మండపంలో 21 కిలోల లడ్డూను కొందరు స్కూల్‌ విద్యార్థులు ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గణేష్ మండపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

స్కూల్‌ నుంచి వెళ్తున్న విద్యార్థులుగా గణేష్ మండపం వద్ద తచ్చాడుతూ కనిపించారు. మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేశారు స్టూడెంట్స్‌. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మండపాల్లో కొలువుదీరిన వినాయకుడు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకుంటున్నాడు. వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఆయన చేతిలో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. గణేషుడితో పాటు.. ఆయన చేతిలో పెట్టే లడ్డు కూడా నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. ఆ లడ్డునూ నవరాత్రుల చివరి రోజు వేలం వేస్తారు. లడ్డూను దక్కించుకున్నవారిని అదృష్టవంతులుగా భక్తులు భావిస్తారు. లడ్డూను దక్కించుకున్న కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసిస్తారు.